కలం, వెబ్ డెస్క్ : పంజాబ్ పోలీస్ శాఖకు చెందిన హెడ్ కానిస్టేబుల్ (Punjab Head Constable) వినోద్ కుమార్ విధులు ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి అమృత్సర్-పఠాన్‌కోట్ జాతీయ రహదారిపై మాన్ కౌర్ గ్రామం సమీపంలో ఆయన మృతదేహం రక్తపు మడుగులో పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.
తలపై తుపాకీతో కాల్చిన గాయాలు ఉండటంతో గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపి హత్య చేసినట్లు లా అండ్ ఆర్డర్ డీజీపీ ప్రవీణ్ కుమార్ సిన్హా వెల్లడించారు. ఈ ఘటన వెనుక ఉగ్రకోణం ఉండే అవకాశాలను కూడా తోసిపుచ్చలేమని ఆయన పేర్కొన్నారు.
మరోవైపు, ఈ హత్యకు తామే బాధ్యత వహిస్తున్నట్లు తెహ్రీక్-ఇ-తాలిబాన్ హిందుస్తాన్ అనే సంస్థ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. హత్యకు ముందు వినోద్ కుమార్ ఇద్దరు వ్యక్తులతో కలిసి మోటార్ సైకిల్‌పై వెళ్తున్న సీసీటీవీ దృశ్యాలు కూడా వెలుగులోకి వచ్చాయి.
ఆదివారం రాత్రి 9:15 గంటల సమయంలో వినోద్ తన సోదరుడు రామ్ లాల్‌కు ఫోన్ చేసి పాత పాఠశాల సమీపానికి చేరుకున్నట్లు చెప్పారు. మరో పదిహేను నిమిషాల తర్వాత బైపాస్ వద్దకు వచ్చి తనను తీసుకెళ్లాలని కోరారు. అయితే రామ్ లాల్ అక్కడికి చేరుకునేసరికి వినోద్ కనిపించలేదు. అనంతరం అర్ధరాత్రి ఒంటి గంట ప్రాంతంలో బైపాస్ రోడ్డు పక్కన ఆయన మృతదేహం లభ్యమైంది. ఘటనా స్థలంలో ఆయన వస్తువులు కూడా మాయమయ్యాయి.
పదోన్నతి పొందిన తర్వాత జహాన్ ఖేలన్ శిక్షణా కేంద్రానికి వెళ్లిన వినోద్ కుమార్, అక్కడి నుంచి శిక్షణ నిమిత్తం సంగ్రూర్ వెళ్లారని దర్యాప్తు అధికారి ఎస్ఐ మోహన్ లాల్ తెలిపారు. ఆదివారం రాత్రి తిరిగి గురుదాస్‌పూర్ వస్తుండగా ఈ ఘోరం జరిగింది. అర్ధరాత్రి సమయంలో సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
సోమవారం సాయంత్రం ఘటనా స్థలాన్ని పరిశీలించిన ఏడీజీపీ ప్రవీణ్ కుమార్ సిన్హా, బోర్డర్ రేంజ్ ఐజీ గుర్ప్రీత్ సింగ్ భుల్లర్ మాట్లాడుతూ, సోషల్ మీడియా పోస్ట్‌పై దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. బైక్‌పై లిఫ్ట్ అడిగి ఎక్కిన వినోద్‌ను ఆ ఇద్దరు దుండగులే తలపై కాల్చి చంపినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో పంజాబ్ రాష్ట్రవ్యాప్తంగా హై అలర్ట్ ప్రకటించి, నిందితుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.

