కలం, వెబ్ డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీల అమలు చేయడంలో విఫలమైందని బీఆర్ఎస్ నేత హరీశ్ రావు (Harish Rao) ధ్వజమెత్తారు. మేనిఫెస్టోకు మూడేళ్లు పూర్తయిన సందర్భంగా ఆయన ఎక్స్ వేదికగా పోస్ట్ లో విమర్శలు చేశారు. ఎన్నికల ముందు మేనిఫెస్టోను భగవద్గీత, ఖురాన్, బైబిల్‌తో సమానమని చెప్పిన కాంగ్రెస్ నేతలు.. అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను పట్టించుకోలేదన్నారు. గొప్పగా ప్రచారం చేసుకున్న అభయహస్తం పథకం శూన్య హస్తంగా మారిందని విమర్శించారు.
మూడేళ్ల క్రితం ఖర్గే సమక్షంలో రేవంత్ రెడ్డి మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలు చేస్తామని హామి ఇచ్చారని హరీశ్ రావు గుర్తు చేశారు. అయితే, ఇన్నేళ్లు గడిచినా హామీల అమలుపై స్పష్టత లేదని ఎద్దేవా చేశారు. గాంధీ భవన్ వేదికగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను ఎందుకు నిలబెట్టుకోలదని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, మేనిఫెస్టో కమిటీ బాధ్యులు హామీల అమలుపై సమాధానం చెప్పాలని ఆయన (Harish Rao) డిమాండ్ చేశారు.
తొలి క్యాబినెట్ సమావేశంలోనే 6 గ్యారెంటీలకు చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇచ్చినప్పటికీ, 38 మంత్రివర్గ సమావేశాలు జరిగినా ఇంకా చట్టబద్ధత కల్పించలేదని హరీశ్ రావు విమర్శలు చేశారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీల పేరుతో ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ హామీలను పక్కన పెడుతోందని విమర్శించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలను చూసి గాంధీ ఆత్మకూడా క్షోభిస్తుందని హరీశ్ రావు పేర్కొన్నారు.

