కలం, జగిత్యాల: జగిత్యాల జిల్లా కొడిమ్యాల (Kodimial) మండలం పూడూరు గ్రామ శివారులో ఆదివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం (Pudur Road Accident) చోటుచేసుకుంది. కంటైనర్ లారీ రూపంలో దూసుకొచ్చిన మృత్యువు ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఈ ప్రమాదంలో భర్త మృతి చెందగా భార్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కరీంనగర్‌కు చెందిన హరీష్ మెట్టువాని (52), తన భార్య రియా మెట్టువానితో కలిసి ఆదివారం ఉదయం 7:30 గంటల ప్రాంతంలో టాటా నెక్సన్ కారు (TS 09 FW 4393)లో కరీంనగర్ నుండి నిజామాబాద్ వైపు బయలుదేరారు. వారు ప్రయాణిస్తున్న కారు కొడిమ్యాల మండలం పూడూరు గ్రామ శివారులోని ఎన్‌హెచ్-563 పైకి రాగానే, కరీంనగర్ వైపు వస్తున్న ఓ కంటైనర్ లారీ (TS 07 UF 9569) అతివేగంగా అజాగ్రత్తగా వచ్చి వారి కారును బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాద తీవ్రతకు కారులో ఉన్న హరీష్ మెట్టువానికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు, స్థానికులు స్పందించి క్షతగాత్రులను మెరుగైన చికిత్స నిమిత్తం కరీంనగర్‌లోని రెనే ఆసుపత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతూ హరీష్ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ ప్రమాదంలో ఆయన భార్య రియాకు కూడా తీవ్ర గాయాలయ్యాయి.
ప్రమాదానికి కారణమైన కంటైనర్ లారీని మహారాష్ట్ర కు చెందిన ఉత్రేశ్వర్ అనే డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా నడపడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని మృతుని అన్న తేజోవాన్ మెట్టువాని కొడిమ్యాల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు కొడిమ్యాల ఎస్సై ఏ. నరేష్ కుమార్ కంటైనర్ డ్రైవర్‌పై కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఉదయం పూట జరిగిన ఈ రోడ్డు ప్రమాదంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.

