కలం, వెబ్ డెస్క్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బీసీ కులగణనపై చర్చిస్తుండగా బీజేపీ నేతలు సభను వాకౌట్ చేయడంపై మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీసీ కులగణనపై బీజేపీ వైఖరిని తెలంగాణ ప్రజలకు తెలియజేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన సభలో మాట్లాడుతూ.. బీసీ కులగణన తీర్మానానికి సభలో మద్దతు తెలిపి, బీజేపీ నేతలు బయట మరో విధంగా మాట్లాడుతున్నారని విమర్శించారు.
బీసీలకు సంబంధించిన తీర్మానంపై బీజేపీ ద్వంద్వ వైఖరి అవలంభిస్తోందని మండిపడ్డారు. బీసీల అధికారిక జాబితాను కులగణనలో చేర్చాలన్న తీర్మానాన్ని బీజేపీ వ్యతిరేకిస్తోందన్నారు. కేంద్ర ప్రభుత్వం చెప్పిన విధానానికి అనుగుణంగా బీసీల వివరాలు కులగణనలో నమోదు చేయాలని కోరుతున్నట్లు చెప్పారు.
బీసీల అధికారిక జాబితాను కులగణనలో చేర్చాలని తెలంగాణ ప్రభుత్వం తీర్మానం చేసిందని.. ఈ తీర్మానంపై బీజేపీ వైఖరి తెలంగాణ బీసీలకు అవమానకరమని మంత్రి పేర్కొన్నారు. బీజేపీ వైఖరిపై బీసీ సంఘాలు ఆ పార్టీ నాయకత్వాన్ని నిలదీయాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కుల విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరిని ప్రశ్నించాలన్నారు. కులగణనలో బీసీలకు న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పోరాడుతుందని స్పష్టం చేశారు.
తెలంగాణలో సమగ్ర కుటుంబ కుల సర్వేను శాస్త్రీయంగా నిర్వహించి దేశానికే రోల్ నిలిచామని మంత్రి అన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం చట్టపరమైన చర్యలు చేపట్టిందని.. 50 శాతం రిజర్వేషన్ పరిమితిని దాటాలంటే శాస్త్రీయమైన కుల గణాంకాలు అవసరం అని చెప్పారు. కేంద్రం ఎస్సీ, ఎస్టీల వివరాలు సేకరిస్తున్నప్పుడు బీసీల వివరాలు ఎందుకు సేకరించదు అని ప్రశ్నించారు. బీసీలకు జనాభా ప్రాతిపదికన న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.

