కలం, జోగుళాంబ గద్వాల: వ్యవసాయానికి సరిపడా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, లో-వోల్టేజ్, విద్యుత్ అంతరాయాల కారణంగా మోటార్లు కాలిపోయి రైతులు నష్టపోతున్నారని బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధరెడ్డి (Snigdha Reddy) ఆరోపించారు. గురువారం ధరూర్ మండల కేంద్రంలోని 33/11 KV సబ్ స్టేషన్ ఎదుట వ్యవసాయ విద్యుత్ కోతలకు నిరసనగా మండల రైతులు చేపట్టిన రోడ్డు ధర్నా కార్యక్రమానికి బీజేపీ నాయకులతో కలిసి ఆమె పూర్తి మద్దతు తెలిపారు.
24 గంటల విద్యుత్ హామీ ఏమైంది?
ఈ సందర్భంగా స్నిగ్ధరెడ్డి (Snigdha Reddy) మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని ప్రచారం చేసుకుంటున్నా, క్షేత్రస్థాయిలో కనీసం 12 గంటలు కూడా విద్యుత్ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పగటిపూట కరెంట్ లేక రైతులు రాత్రి వేళల్లో ప్రాణాలకు తెగించి పొలాలకు వెళ్లాల్సి వస్తోందన్నారు. విద్యుత్ సరఫరాలో సాంకేతిక లోపాలు, తీవ్రమైన లో-వోల్టేజ్ వల్ల వ్యవసాయ మోటార్లు తరచూ కాలిపోతున్నాయని, దీంతో రైతులపై అదనపు ఆర్థిక భారం పడుతోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
రెండు రోజుల్లో సమస్య పరిష్కారానికి హామీ
ప్రభుత్వం వెంటనే స్పందించి కాలిపోయిన ట్రాన్స్‌ఫార్మర్లను అత్యవసర ప్రాతిపదికన మార్చాలని, విద్యుత్ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. అలాగే రైతులకు ధీటుగా ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను సమర్థవంతంగా అమలు చేసి పంట నష్టపరిహారం అందించాలని కోరారు. విషయం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఎస్ఈ అబ్దుల్ కరీమ్, డీఈ రవిప్రసాద్ సంఘటన స్థలానికి చేరుకుని రైతులతో, నాయకులతో చర్చలు జరిపారు. ఉన్నతాధికారులతో మాట్లాడి 2 రోజుల్లో విద్యుత్ సమస్యలను పరిష్కరిస్తామని అధికారుల హామీ ఇవ్వడంతో రైతులు నిరసన కార్యక్రమాన్ని విరమించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్ర రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకట రాములు, అక్కల రమాదేవి, జిల్లా కోశాధికారి మిర్జాపురం రామచంద్ర రెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, కిసాన్ మోర్చా అధ్యక్షుడు దరూర్ కిష్టన్న, OBC మోర్చా అధ్యక్షుడు దాస్, జిల్లా SC మోర్చా ఆంజనేయులు, మండల అధ్యక్షుడు తిమ్మా రెడ్డి, తిరుపతి రెడ్డి, శ్రీపాద రెడ్డి, శ్రీనివాసులు, బీజేపీ సీనియర్ నాయకులు సంజీవ్ భరద్వాజ్, నర్సన్ దొడ్డి క్రిష్ణ రెడ్డి, మిర్జాపురం వెంకటేశ్వర రెడ్డి, రజక నరసింహులు, చింత రేవుల రాజేష్ అయ్యా, హన్మంతరాయ, శేఖర్ రెడ్డి, DR లక్మన్న, రామి రెడ్డి, అనిల్, దామ నాగరాజు, సంజీవ రెడ్డి, యువరాజ్, సద్దల కృష్ణ, కౌన్సిలర్ శాలన్న, నాయకులు , రైతులు పాల్గొన్నారు.

