Mobile Popup Ad
Mobile Popup Ad

పొంగులేటి మార్క్ రాజకీయం.. పొన్నేకల్‌లో భారీగా కాంగ్రెస్‌లోకి చేరికలు!

కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం జిల్లా రాజకీయాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి తనదైన ముద్రను వేస్తున్నారు. కేవలం అధికార బలంతో కాకుండా, క్షేత్రస్థాయిలో అభివృద్ధిని చూపిస్తూ ప్రత్యర్థి పార్టీలను ఆత్మరక్షణలో పడేసే వ్యూహాన్ని ఆయన అమలు చేస్తున్నారు. తాజాగా ఖమ్మం రూరల్ మండలం పొన్నేకల్ గ్రామానికి చెందిన బీఆర్ఎస్, సీపీఎం సహా వివిధ పార్టీలకు చెందిన 50 కుటుంబాలు కాంగ్రెస్ గూటికి చేరడం జిల్లా రాజకీయాల్లో ప్రాధాన్యత సంతరించుకుంది.

కాంగ్రెస్ మరింత బలోపేతం..

సోమవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి సమక్షంలో జరిగిన ఈ చేరికలు, ఖమ్మం రూరల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పట్టును మరింత బలోపేతం చేశాయి. ​సాధారణంగా ఎన్నికల సమయంలో లేదా స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మారడం చూస్తుంటాం. కానీ, ఈ చేరికల వెనుక పొన్నేకల్ ప్రజలు స్పష్టమైన కారణాలను విశ్లేషించారు. దశాబ్దాలుగా వెనుకబడిన తమ ప్రాంతానికి మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి వచ్చిన తర్వాతే మోక్షం లభించిందని వారు బలంగా నమ్ముతున్నారు. తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న అంతర్జాతీయ స్థాయి ‘యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్’ను పొన్నేకల్ గ్రామంలోనే నిర్మించాలని నిర్ణయించడం స్థానికులను ఎంతగానో ప్రభావితం చేసినట్లు తెలుస్తోంది. తమ పిల్లల భవిష్యత్తుకు ఈ స్కూల్ పెద్ద పీట వేస్తుందనే నమ్మకం వారిలో పెరగడంతో పాటు నిరుపేదలకు పారదర్శకంగా, అర్హత ప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులు జరుగుతుండటం క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వానికి భారీగా మైలేజ్ తెచ్చి పెట్టిందని చెప్పొచ్చు.

విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ..

​ఖమ్మం రూరల్ మండలంలో బీఆర్ఎస్, సీపీఎం పార్టీలకు గట్టి క్యాడర్ బేస్ ఉంది. అయితే, పొన్నేకల్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో రాయల సైదులు, మారపొంగు నరేష్, సిరిపల్లి లక్ష్మయ్య, గార్లపాటి ఉపేందర్, వరగాని ఉపేందర్ వంటి కీలక సామాజిక, రాజకీయ కుటుంబాలు కాంగ్రెస్‌లోకి రావడం వల్ల విపక్షాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందని స్థానికంగా చర్చ నడుస్తుంది. దశాబ్దాలుగా సాధించలేని అభివృద్ధిని ‘శీనన్న’ కొద్ది కాలంలోనే కళ్లముందు సాక్షాత్కరింపజేశారని వారు బహిరంగంగా ప్రకటించడం విపక్షాలకు రాజకీయంగా పెద్ద ప్రతిబంధకంగా మారింది.

కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం..

​మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి రాష్ట్రస్థాయి బాధ్యతల్లో బిజీగా ఉన్నప్పటికీ, ఆయన క్యాంప్ కార్యాలయ ఇన్‌ఛార్జ్ తుంబూరు దయాకర్ రెడ్డి నియోజకవర్గంలో ఎప్పటికప్పుడు క్యాడర్‌ను సమన్వయం చేస్తున్నారు. స్వచ్ఛందంగా తరలివచ్చిన 50 కుటుంబాలకు హస్తం కండువా కప్పి, పార్టీలోకి సాదరంగా ఆహ్వానించడం ద్వారా కాంగ్రెస్ శ్రేణుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపారు. ఖమ్మం రూరల్ మండల అధ్యక్షుడు తోట వీరభద్రం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు కోటి రమణ, గ్రామ శాఖ అధ్యక్షుడు వంగూరి రవితో పాటు స్థానిక సీనియర్ నేతలంతా కలిసికట్టుగా ఈ చేరికల ప్రక్రియను విజయవంతం చేయడం కాంగ్రెస్ అంతర్గత బలాన్ని సూచిస్తోంది.

అభివృద్ధే ఆయుధం..

​మొత్తంగా చూస్తే ఖమ్మం జిల్లాలో పొంగులేటి శ్రీనివాస రెడ్డి మార్క్ రాజకీయం ఎప్పుడూ ‘ప్రజల మనిషి’ అనే ట్యాగ్‌తోనే సాగుతుంది. ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ఆయన తన నియోజకవర్గానికి తెస్తున్న భారీ ప్రాజెక్టులు, సంక్షేమ పథకాలు క్షేత్రస్థాయిలో ప్రజలను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. పొన్నేకల్ గ్రామంలో జరిగిన ఈ రాజకీయ పరిణామం రాబోయే రోజుల్లో ఖమ్మం రూరల్ మండలంలోని మరికొన్ని గ్రామాల్లో కూడా పునరావృతమయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విపక్షాలు కేవలం విమర్శలకే పరిమితమైతే, పొంగులేటి మాత్రం ‘అభివృద్ధి’నే ఆయుధంగా మలచుకుని ముందుకు సాగుతున్నట్లు పొన్నేకల్ చేరికల ఉదంతం స్పష్టం చేస్తోందనీ జిల్లా ప్రజలు చర్చించుకుంటున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>