కలం, ఖమ్మం బ్యూరో: రైతును రాజును చేసేలా పథకాలు రూపొందించి, వాటిని అమలు చేస్తున్న ఘనత ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వానిదైతే.. రైతుకు సంకెళ్లు వేసి జైలుకు పంపించిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Ponguleti Srinivas Reddy) ఫైర్ అయ్యారు. ఆదివారం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలంలో జరిగిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో మంత్రి పొంగులేటి పాల్గొని మాట్లాడారు. ఇదే ఖమ్మం పట్టణంలో నడి రోడ్డు మీద, చంటి పిల్లలు ఉన్నారని కూడా పట్టించుకోకుండా రైతులకు సంకెళ్లు వేసి జైలుకు పంపించారని గుర్తు చేశారు. గత రెండున్నరేళ్లలో పేదల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలు అమలు చేశామని, వాటిని మరింత ప్రజలకు చేరువ చేయడానికి 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక చేపట్టామన్నారు. పాలేరు నియోజకవర్గంలో ప్రతి మండలాన్ని మూడు క్లస్టర్లుగా విభజించి, ప్రతి క్లస్టర్‌లో 10 నుంచి 12 గ్రామాలను ఏర్పాటు చేసి ప్రజా దర్బార్ నిర్వహిస్తున్నామని వివరించారు. సాదా బైనామా, భూమి రికార్డు సమస్యలు, నిషేధిత జాబితా సమస్యలు వంటి వాటికి శాశ్వత పరిష్కారం కోసం ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే ఎక్కువ..
ప్రతి ప్రజా దర్బార్‌లో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులే అధికంగా వస్తున్నాయని, గత ప్రభుత్వం ఇళ్లు ఇవ్వకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని మంత్రి పొంగులేటి వివరించారు. తమ ప్రభుత్వం ప్రతి సోమవారం ఇళ్ల నిర్మాణానికి నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. మే నెలాఖరులో రెండవ దశ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని, మూడవ, నాలుగో దశల్లో కూడా ఇళ్లు మంజూరు కొనసాగుతాయన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ దరఖాస్తుల్లో ఇప్పటికే వందల సంఖ్యలో పరిష్కారం చూపినట్లు వివరించారు.
ప్రజా దర్బార్‌కు విశేష స్పందన: కలెక్టర్
జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్ మాట్లాడుతూ.. ప్రజా దర్బార్ కార్యక్రమానికి విశేష స్పందన లభిస్తోందన్నారు. ప్రతి క్లస్టర్‌కు 1500 నుంచి 2000 వరకు దరఖాస్తులు అందుతున్నాయని తెలిపారు. ప్రతి దరఖాస్తును సమగ్రంగా పరిశీలించి, అర్హమైన ప్రతి దరఖాస్తును తప్పకుండా పరిష్కరిస్తామని తెలిపారు. అనంతరం ఇందిరమ్మ ఇంటి లబ్ధిదారులు నాగజ్యోతి మాట్లాడుతూ.. గతంలో తాము ఒకే గదిలో నివసిస్తూ ఇబ్బందులు పడినట్లు తెలిపారు. ప్రజా ప్రభుత్వం వచ్చాక తమకు ఇల్లు మంజూరై నిర్మాణం పూర్తయిందని, బిల్లులు సకాలంలో వచ్చాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్ రాయల నాగేశ్వరరావు, మద్దులపల్లి మార్కెట్ కమిటీ ఛైర్మన్ హరినాథ్ బాబు, ఆర్డీవో శ్రీనివాస్, తహసీల్దార్ సైదులు, ప్రజా ప్రతినిధులు, సర్పంచులు పాల్గొన్నారు.

