కలం, దేవరకొండ: దసరా దేవీ నవరాత్రి ఉత్సవాల వేళ నల్లగొండ జిల్లా డిండి మండలం శాంతిగూడెం (Shanthigudem) గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపన స్థలం విషయంలో ఏర్పడిన రాజకీయ వివాదం చివరకు అమ్మవారి విగ్రహాన్ని పూజలు కూడా చేయకుండానే నిమజ్జనం(Durga Idol Immersion) చేసే దుస్థితికి దారితీసింది. పండుగ పూట భక్తిశ్రద్ధలతో జరగాల్సిన ఉత్సవాలు రెండు వర్గాల ఘర్షణ కారణంగా నిలిచిపోవడంపై భక్తులు తీవ్ర నిరాశ, ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
శాంతిగూడెంలో దేవీ ఉత్సవాల నిర్వహణకు సంబంధించి విగ్రహాన్ని ఏ స్థలంలో ప్రతిష్ఠించాలనే అంశంపై రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన వర్గాల మధ్య విభేదాలు మొదలయ్యాయి. ఒకే చోట విగ్రహాన్ని ఏర్పాటు చేయాలంటూ ఇరువర్గాలు పట్టుబట్టడంతో వివాదం క్షణక్షణానికి ముదిరింది. మాటామాటా పెరిగి ఇరువర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. దీంతో గ్రామంలో ఒక్కసారిగా శాంతిభద్రతల సమస్య తలెత్తింది. వివాదం మరింత ముదరడం, ఇరువర్గాలు వెనక్కి తగ్గకపోవడంతో నవరాత్రి ఉత్సవాలను నిర్వహించేందుకు అనుకూలమైన వాతావరణం లేకుండాపోయింది.
తొమ్మిది రోజుల పాటు అత్యంత వైభవంగా జరగాల్సిన పూజా కార్యక్రమాలకు ఆటంకం కలగడంతో, చేసేది లేక ప్రతిష్ఠాపనకు ముందే అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా తీసుకెళ్లి నీటిలో నిమజ్జనం చేశారు. కనీసం పూజలు, ప్రసాద నివేదనలు కూడా లేకుండానే విగ్రహాన్ని నిమజ్జనం చేయాల్సి రావడం గ్రామంలో చర్చనీయాంశంగా మారింది. పండుగ వేళ దేవుడి ఉత్సవాల్లోనూ రాజకీయ రంగు పులిమి విభేదాలు సృష్టించడంపై స్థానిక భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అమ్మవారి ఆశీస్సులు పొందాల్సిన సమయంలో ఇలాంటి అపచారం జరగడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో శాంతి, సామరస్యాలు నెలకొనాల్సిన పండుగ రోజుల్లో రాజకీయ విభేదాల కారణంగా ఉత్సవాలు నిలిచిపోయాయని, ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.

