కలం, కరీంనగర్ బ్యూరో: విద్యార్థులు చిన్ననాటి నుంచే తమ భవిష్యత్ లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దానిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదలతో కష్టపడాలని కరీంనగర్ పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (CP Gaush Alam) సూచించారు. కేశవపట్నం మండలం మెట్పల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత ప్రభుత్వ పాఠశాల (Metpally School) లో నిర్వహించిన “పోలీసులు మీకోసం” కార్యక్రమానికి సీపీ ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులు, తల్లిదండ్రులకు భవిష్యత్ ప్రణాళిక, లక్ష్య సాధనపై అవగాహన కల్పించారు. విద్యార్థులను వారి భవిష్యత్ లక్ష్యాల గురించి అడిగి తెలుసుకుని, ప్రతి విద్యార్థికి గోల్ కార్డు రూపొందించి, ఫోటో ఫ్రేమ్‌ను అందజేశారు.
ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. తన తండ్రి ఆర్మీలో పనిచేయడం వల్ల చిన్ననాటి నుంచే యూనిఫాం సర్వీస్‌పై ఆసక్తి ఏర్పడిందని, అదే లక్ష్యంగా పెట్టుకుని కష్టపడి 25 ఏళ్ల వయసులో ఐపీఎస్ సాధించానని తన స్వీయ అనుభవాలను విద్యార్థులతో పంచుకున్నారు. కేవలం లక్ష్యాన్ని చేరుకోవడం మాత్రమే కాకుండా, ఆ లక్ష్యం వెనుక ఉన్న ‘పర్పస్’ను నెరవేర్చడం అత్యంత ముఖ్యమని అన్నారు. విద్యార్థులు తమకు నచ్చిన రంగాన్ని ఎంచుకుని, అందుకు అనుగుణంగా ఇప్పటి నుంచే ప్రణాళికతో ముందుకు సాగాలని సూచించారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉండాలి
మత్తు పదార్థాలకు అలవాటు పడటం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని సీపీ హెచ్చరించారు. డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ, చదువుతో పాటు క్రీడలు, సృజనాత్మక కార్యక్రమాలపై దృష్టి సారించాలని సూచించారు. డ్రగ్స్ వల్ల కలిగే అనర్థాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన డ్రగ్స్ వ్యతిరేక స్కిట్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
సీసీ కెమెరాల ప్రారంభం.. క్రీడా సామగ్రి పంపిణీ
మెట్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల నిఘా వ్యవస్థను సీపీ ప్రారంభించారు. గ్రామంలో శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకంగా పనిచేస్తాయని తెలిపారు. గ్రామ పంచాయతీ కార్మికులకు హెల్మెట్లు, విద్యార్థులకు వాలీబాల్, క్యారమ్ బోర్డులు, ఇతర క్రీడా సామగ్రిని పంపిణీ చేశారు. అనంతరం పాఠశాల ఆవరణలో మొక్కను నాటారు.
గణేష్ మండపాల పరిశీలన
అనంతరం కేశవపట్నం పరిధిలోని పలు గణేష్ మండపాలను సీపీ సందర్శించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. మండపాల వద్ద ఎలక్ట్రికల్ సేఫ్టీ, ఫైర్ సేఫ్టీ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని నిర్వాహకులకు సూచించారు. నిమజ్జనం సందర్భంగా విద్యుత్ తీగలు, నీటి వనరులు, ట్రాఫిక్ తదితర అంశాల్లో అప్రమత్తంగా ఉండాలని, భక్తుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని తెలిపారు.
మండపాల వద్ద నిర్వహిస్తున్న పాయింట్ బుక్‌లను సీపీ తనిఖీ చేసి, సిబ్బంది విధులు, భద్రతా చర్యలపై అధికారులకు సూచనలు చేశారు. గణేష్ ఉత్సవాలు, నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు.
కార్యక్రమంలో ఏసీపీ మాధవి, ఎస్సై శేఖర్, పోలీసు అధికారులు, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

