కలం, మెదక్ బ్యూరో: బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఫ్యామిలీకి చెందిన భూములను కాంగ్రెస్ నేతలు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ మేరకు సిద్దిపేట జిల్లా కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులో ఉన్న హరీష్ రావు మామ హనుమంతరావు భూములను కాంగ్రెస్ ఎంపీలు, ఎమ్మెల్సీల బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ లావణి పట్టా భూముల బదిలీకి సంబంధించిన చట్టపరమైన నిబంధనలను, అందులో జరిగిన ఉల్లంఘనలను మీడియాకు వెల్లడించారు.
‘‘లావణి పట్టా భూములను సాధారణంగా ఇతరులకు బదిలీ చేయడానికి చట్టరిత్యా వీలులేదు. ఒకవేళ ఈ భూములను ట్రాన్స్ఫర్ చేయాల్సి వస్తే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. సంబంధిత అధికారులు విధిగా ‘ఎన్వోసీ’ మంజూరు చేయాల్సి ఉంటుంది. స్వాతంత్ర్య సమరయోధులు, మాజీ సైనిక ఉద్యోగులకు కేటాయించిన భూముల విషయంలోనూ కలెక్టర్ లేదా అంతకంటే పైస్థాయి అధికారుల అనుమతి పొందిన తర్వాతే లావాదేవీలు జరపాలి”అని ఆయన అన్నారు.
వెలికట్ట గ్రామ శివారులోని సర్వే నంబర్ 271లో ఉన్న లావణి పట్టా భూములకు కూడా ఇవే ప్రాథమిక నిబంధనలు వర్తిస్తాయని కాంగ్రెస్ బృందం పేర్కొంది. అయితే ఈ నిబంధనలను పక్కనబెట్టి హరీష్ రావు మామ లావణి పట్టా భూములు 6 ఎకరాల 18 గుంటలు కొనుగోలు, విక్రయ లావాదేవీలు జరిపినట్లు ఆరోపించారు.
చట్టప్రకారం లావణి పట్టా భూములకు బదిలీ నిషేధం అమలులో ఉన్నప్పుడు ఈ కొనుగోళ్లు ఏ విధంగా జరిగాయని ప్రశ్నించారు. ఈ లావాదేవీలకు ప్రభుత్వం నుంచి ముందస్తు అనుమతి తీసుకున్నారా? లేదా? అలాగే సంబంధిత అధికారులు NOC ఇచ్చారా? అనే విషయాలపై పూర్తి స్పష్టత రావాల్సి ఉందన్నారు. భూముల పాత రికార్డులు, డాక్యుమెంట్లు, అనుమతి పత్రాలను ఉన్నతాధికారులు సమగ్రంగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎంపీ, ఎమ్మెల్సీల బృందం డిమాండ్ చేశారు.

