ఉద్యోగులు భాగస్వాములే కానీ.. బానిసలు కారు: గుంజపడుగు

కలం, కరీంనగర్: ఉద్యోగులు, ఉపాధ్యాయులు ప్రజలకు మెరుగైన పాలన అందించడంలో కీలక భాగస్వాములే తప్ప ప్రభుత్వానికి బానిసలు కాదని తెలంగాణ రక్షణ సేన జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ స్పష్టం చేశారు. టీఆర్ఎస్ ఆధ్వర్యంలో శుక్రవారం జిల్లా కేంద్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా హరిప్రసాద్ మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో ఉద్యోగాలు పక్కనపెట్టి పోరాడిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం కమిటీల పేరిట కాలయాపన చేయడం సరికాదన్నారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలు కేవలం మాటలకే పరిమితం కాకుండా ఉత్తర్వుల రూపంలో అమలులోకి రావాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు. ఉద్యోగ జేఏసీ చేసే పోరాటానికి తెలంగాణ రక్షణ సేన సంపూర్ణ మద్దతు ఇస్తుందని తెలిపారు. ఈ సమావేశంలో పలు తీర్మాణాలు ఆమోదించారు. పెండింగ్‌లో ఉన్న 6 డీఏ (DA)లను తక్షణమే విడుదల చేయాలని, 51 శాతం ఫిట్‌మెంట్‌తో నూతన పీఆర్‌సీ (PRC)ని ప్రకటించాలని, సీపీఎస్ (CPS) విధానాన్ని రద్దు చేసి, పాత పెన్షన్ విధానాన్ని (OPS) పునరుద్ధరించాలన్నారు.

హెల్త్ కార్డ్‌లు (EHS) అన్ని కార్పొరేట్ హాస్పిటళ్లలో ఓపీ (OP) సౌకర్యంతో చెల్లుబాటు అయ్యేలా చర్యలు తీసుకోవాలని హరిప్రసాద్ కోరారు. జీవో 317, జీవో 19 బాధితులైన ఉద్యోగులకు, స్పాసెస్ (భార్యాభర్తలు)కు సొంత జిల్లాలకు సర్దుబాటు చేయాలన్నారు. జీవో 25ను రద్దు చేసి, ప్రాథమిక పాఠశాలల్లో ప్రతి తరగతికి ఒక ఉపాధ్యాయుడితో పాటు హెచ్‌ఎమ్ (HM) పోస్టును కేటాయించాలని కోరారు.

ప్రాథమిక పాఠశాలల్లో ఇంగ్లీష్, తెలుగు స్కూల్ అసిస్టెంట్ పోస్టులను నియమించాలని హరిప్రసాద్ డిమాండ్ చేశారు, ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల ఉన్నత విద్యకు సంబంధించి జీవో 342ను పూర్తిస్థాయిలో అమలు చేయాలని, విశ్రాంత ఉద్యోగుల పెన్షన్, ఇతర బకాయిలను సకాలంలో చెల్లించాలని కోరారు. రిటైర్ అయిన రోజే రూ.5 లక్షలు ఖాతాలో జమ చేయాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఉద్యోగ, ఉపాధ్యాయ, విశ్రాంత సంఘాల ప్రతినిధులు జాడి శ్రీనివాస్, తానిపర్తి తిరుపతి రావు, మల్లిక్, కిషన్ నాయక్, రవి నాయక్, రేలెల్లి తిరుపతి, పాట నర్సయ్య, పీఆర్ శ్రీనివాస్, గండ్ర రవీందర్ రావు, శ్రీరాముల బాల సురేందర్, కోటేశ్వర్, బిఆర్ ప్రసాద్, నిమ్మ భరత్, పార్టీ కరీంనగర్ పార్లమెంట్ ఇంచార్జ్ లింగంపల్లి శ్రీనివాస్, నియోజకవర్గ ఇంచార్జ్ అంకం శివరాణి, మానకొండూరు ఇంచార్జ్ చెన్నమల్ల చైతన్య, మహిళా విభాగం అధ్యక్షురాలు పిన్నింటి సంగీత రెడ్డి, నగర అధ్యక్షుడు రంగరవేణి లక్ష్మణ్, జిల్లా నాయకులు మేకల తిరుపతి, కుతాడి శ్రీనివాస్, బసవేని రాజేందర్, దాసరి అంజలి, కొలిపాక గౌతమి తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>