ఆలేరులో బీసీ జెండా ఎగరేసి తీరుతా: తీన్మార్ మల్లన్న

‎కలం, ఆలేరు: తెలంగాణలో 90 శాతం ఉన్న బీసీల బతుకులు మారాలని.. రాష్ట్రంలో రెడ్ల పరిపాలన అంతం కావాలని తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధినేత తీన్మార్ మల్లన్న (Theenmar mallanna) అన్నారు. ‘బీసీ రాజ్యాధికార యాత్ర’లో భాగంగా 48వ రోజు పాదయాత్రగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు నియోజకవర్గానికి చేరుకున్న ఆయనకు స్థానిక నాయకులు స్వాగతం పలికారు. అనంతరం ఆలేరు సెంటర్ లో నిర్వహించిన కార్నర్ మీటింగ్ లో మల్లన్న ఘాటుగా ప్రసంగించారు.

రాబోయే ఎన్నికల్లో ఆలేరులో బీసీ జెండా ఎగరేసి తీరుతామని, అవసరమైతే తానే స్వయంగా ఆలేరు నుంచి పోటీ చేస్తానని తీన్మార్ మల్లన్న సంచలన ప్రకటన చేశారు. ఆలేరులో బీసీల అణచివేత ఆనాటి సీపీఐ నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్య రోజుల నుంచే ప్రారంభమైందని మండిపడ్డారు. బీసీలకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకుండా ఆరుట్ల కమలాదేవికి కట్టబెట్టి ఆనాడే బీసీలకు అధికారం దక్కకుండా చేశారని ధ్వజమెత్తారు. 43 నియోజకవర్గాల్లో పట్టుమని 10 లక్షల జనాభా లేని రెడ్లు ఎమ్మెల్యేలై తెలంగాణ సంపదను జాగీరులా లూటీ చేస్తున్నారని ఆరోపించారు. ఆలేరులో రెడ్ల జీతగాళ్లు ఎమ్మెల్యేలుగా ఉండడానికి వీలులేదని, నికార్సైన బీసీ బిడ్డ ఎమ్మెల్యేగా ఉండాలని పేర్కొన్నారు.

అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో 42% రిజర్వేషన్లు ఇస్తామని కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌లో మాటిచ్చిన కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి పాలనలో రిజర్వేషన్లను ఏకంగా 19 శాతానికి కుదించి ఘోరంగా మోసం చేసిందని అసెంబ్లీ ఆధారాలతో తీన్మార్ మల్లన్న బయటపెట్టారు. ఏటా రూ. 20,000 కోట్లు బీసీలకు ఖర్చు చేయాల్సి ఉండగా, మూడేళ్లలో రూ. 60,000 కోట్లకు గాను కేవలం రూ. 2,000 కోట్లు మాత్రమే వెచ్చించారని అన్నారు. మిగతా రూ. 58,000 కోట్ల నిధులను దొంగతనంగా పంచుకు తిన్నారని నిలదీశారు. 2014 కేసీఆర్ సర్వేలో 2 కోట్లు ఉన్న బీసీ జనాభా, రేవంత్ రెడ్డి ఇటీవలి సర్వేలో 1.80 కోట్లకు ఎలా తగ్గిందో సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పదేళ్లలో 20 లక్షల మంది బీసీలు చనిపోయినట్లు దొంగ లెక్కలు రాశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
‎
ఈ కార్యక్రమంలో యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడు కొమిరిశెట్టి నర్సింహులు, ఆలేరు మండల అధ్యక్షుడు చింతపండు వెంకటేష్, రాష్ట్ర కార్యదర్శి పిట్టల శంకర్, పసుల ప్రసన్న, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ బంధారపు నర్సయ్య గౌడ్, స్టేట్ ఆఫీసు కో ఆర్డినేటర్ లింగం యాదవ్, నాయకులు రఘు, సోహెల్, స్థానిక ప్రజలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>