కలం, వెబ్ డెస్క్ : ఇరాన్ నూతన సుప్రీం లీడర్ మొజ్తాబా ఖమేనీ ఆరోగ్య స్థితిపై అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ (Pete Hegseth) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇటీవల జరిగిన దాడుల్లో మొజ్తాబా తీవ్రంగా గాయపడ్డారని, ఆయన ముఖం గుర్తుపట్టలేనంతగా వికృతంగా మారిపోయి ఉండే అవకాశం ఉందని హెగ్సెత్ పేర్కొన్నారు. అమెరికా, ఇజ్రాయెల్ బలగాలు ఉమ్మడిగా నిర్వహించిన ఆపరేషన్‌లో భాగంగానే మొజ్తాబాపై ఈ దాడి జరిగినట్లు తెలిపారు. పెంటగాన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో హెగ్సెత్ సంచలన విషయాలను వెల్లడించారు.
మొజ్తాబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత విడుదల చేసిన మొదటి అధికారిక ప్రకటన కేవలం లిఖితపూర్వకంగానే ఉండటంపై అమెరికా రక్షణ శాఖ అనేక అనుమానాలను వ్యక్తం చేస్తోంది. ఇరాన్ వంటి దేశం వద్ద అత్యాధునిక కెమెరాలు, వాయిస్ రికార్డర్లు ఉన్నప్పటికీ, కనీసం ఒక చిన్న వీడియో లేదా ఆడియో సందేశాన్ని కూడా విడుదల చేయకపోవడం వెనుక పెద్ద రహస్యమే ఉందని హెగ్సెత్ (Pete Hegseth) అభిప్రాయపడ్డారు. మొజ్తాబా తీవ్ర గాయాల పాలై ప్రస్తుతం పరారీలో ఉన్నారని, అందుకే ప్రపంచం ముందుకు రాలేకపోతున్నారని ఆయన అన్నారు.
అంతేకాకుండా, ఇరాన్ నూతన సుప్రీం లీడర్‌గా మొజ్తాబాకు ఎటువంటి చట్టబద్ధత లేదని హెగ్సెత్ పేర్కొన్నారు. తన తండ్రి మరణం తర్వాత భయం గుప్పిట్లో బతుకుతున్న మొజ్తాబా, దేశాన్ని నడిపించే స్థితిలో లేరని అమెరికా భావిస్తోంది. ఇరాన్ ప్రభుత్వం తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి, ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ఇటువంటి లిఖితపూర్వక ప్రకటనలను వాడుకుంటోందని ఆయన ఆరోపించారు. ప్రస్తుతం ఇరాన్ నాయకత్వం తీవ్ర గందరగోళంలో ఉందని, అసలు అక్కడ పాలన ఎవరి చేతుల్లో ఉందో వారికే తెలియని పరిస్థితి నెలకొందని పీట్ హెగ్సెత్ (Pete Hegseth) పేర్కొన్నారు.

