కలం, పెద్దపల్లి: ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు పెద్దపల్లి పట్టణంలోని శాంతినగర్లో నూతన రేషన్ షాపును ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే (Peddapalli MLA) చింతకుంట విజయరమణ రావు(Chinthakunta Vijaya Ramana Rao) స్థానిక నాయకులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా పెద్దపల్లి పట్టణంలోని జెండా చౌరస్తా ప్రధాన రోడ్డులో శ్రీ కల్యాణమస్తు షాపింగ్ మాల్ ఆధ్వర్యంలో నిర్వహించిన బోనాల మహోత్సవ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయరమణ రావు మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పేదలకు ఉచితంగా సన్నబియ్యం పంపిణీ చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో అర్హులైన నిరుపేదలకు రేషన్ కార్డులు మంజూరు చేయకుండా అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రజా ప్రభుత్వంగా కాంగ్రెస్ ప్రభుత్వం అర్హులైన పేదలందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేసి, వారికి సన్నబియ్యం అందిస్తోందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోందని, పేదల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల ప్రభుత్వమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢమాసంలో ఘనంగా నిర్వహించే బోనాల పండుగ రాష్ట్ర సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తోందని విజయరమణ రావు అన్నారు. బోనాల పండుగను మరింత ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సహాయ సహకారాలతో పాటు తగిన గుర్తింపును కల్పిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్, పట్టణ కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

