కలం, వెబ్ డెస్క్: గిరిజన బాలల కోసం ఏలూరు, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో 25 అంగన్వాడీ కేంద్రాలను పునరుద్ధరించాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నిర్ణయించారు. ఏజెన్సీ ప్రాంతాల్లో చిన్నారులకు అంగన్వాడీ కేంద్రాల ద్వారా ఆరోగ్యకరమైన ఎదుగుదలకు అవసరమైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ప్రభుత్వ నిధులు కాకుండా, కార్పొరేట్ సంస్థలతో చర్చలు జరిపి.. సీఎస్ఆర్ పథకం కింద రూ.కోటి సమీకరించారు.
వీటితో అంగన్వాడీ కేంద్రాలను అత్యాధునిక కేంద్రాలుగా చేపట్టాలని పవన్ కల్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజన, మారుమూల ప్రాంతాల చిన్నారులకు పూర్తి స్థాయిలో బాలల సంరక్షణ చర్యలు చేపట్టడంలో ఎలాంటి అలసత్వం వహించవద్దని పేర్కొన్నారు. వారికి పౌష్టికాహారం అందిస్తూనే.. విద్యను అభ్యసించేందుకు అనువైన వాతావరణం కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని తెలిపారు.

