కలం, ఖమ్మం బ్యూరో: గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా శాంతియుత వాతావరణంలో, భక్తిశ్రద్ధలతో నిర్వహించుకోవాలని కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ (ACP Vasundhara Yadav) పిలుపునిచ్చారు. సత్తుపల్లిలోని (Sathupally) ఏసీపీ కార్యాలయంలో గణేష్ మండప నిర్వాహకులతో శుక్రవారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సైబర్ నేరాల అవగాహన పోస్టర్లు, పాయింట్ బుక్స్‌ను నిర్వాహకులకు అందజేశారు. అనంతరం ఏసీపీ మాట్లాడుతూ.. మండపాల నిర్వాహకులు తప్పనిసరిగా పోలీసుశాఖ పోర్టల్ (policeportal.tspolice.gov.in) లో రిజిస్టర్ అయి వివరాలను నమోదు చేసుకోవాలని సూచించారు.
మండపాల ఏర్పాటులో నిబంధనలు పాటించాలి
వివాదాస్పద స్థలాలు, రద్దీగా ఉండే ప్రధాన రహదారులపై విగ్రహాలను ఏర్పాటు చేయవద్దని, ప్రైవేట్ స్థలాలైతే యజమానుల అనుమతి పత్రం తప్పనిసరి అని స్పష్టం చేశారు. మండపాల వద్ద నాణ్యమైన విద్యుత్ వైరింగ్, సీసీ కెమెరాలు, అగ్నిప్రమాద నివారణకు నీరు, ఇసుక సిద్ధంగా ఉంచుకోవాలని, 24 గంటలు ఇద్దరు ప్రతినిధులు ఉండేలా చూసుకోవాలని తెలిపారు. సౌండ్ సిస్టమ్స్ విషయంలో నిబంధనలు కఠినంగా ఉంటాయని, డీజేలకు అనుమతి లేదని స్పష్టం చేశారు.
డీజేలకు అనుమతి లేదు
కేవలం రెండు మైక్ స్పీకర్లను మాత్రమే ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు తక్కువ శబ్దంతో ఉపయోగించాలని, అసభ్యకర కార్యక్రమాలు నిర్వహించకూడదని హెచ్చరించారు. ఊరేగింపు, నిమజ్జనం సమయాల్లో పోలీసులతో సమన్వయం చేసుకుంటూ నిర్ణీత మార్గాల్లో క్రమశిక్షణతో వ్యవహరించాలని, నిమజ్జన ప్రదేశాల్లో చిన్నపిల్లలను నీటిలోకి వెళ్లనీయకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితి తలెత్తితే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. ఈ సమావేశంలో సత్తుపల్లి సీఐ తుమ్మలపల్లి శ్రీహరి, మహిళా ఎస్ఐ కవిత, ఎస్ఐ అశోక్, పోలీస్ సిబ్బంది, మండల గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

