కలం, వెబ్ డెస్క్: మురసు తుఫాను (Cyclone Murasu) ముంచుకొస్తున్న నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం అప్రమత్తమైంది. తుఫాను ప్రభావంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) సమీక్ష నిర్వహించారు. పలు జిల్లాలపై తీవ్రంగా ప్రభావం చూపే అవకాశం ఉండడంతో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరాల శాఖ అధికారులకు ఆయన కీలక ఆదేశాలు జారీ చేశారు. నెల్లూరు, బాపట్ల, ప్రకాశం, కృష్ణా జిల్లాలపై తుఫాను తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని తెలిపారు. అత్యంత భారీ వర్షాల కురిసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు సూచించారు.
లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం ఆదేశించారు. వాగులు, వంకల సమీపంలో ప్రజలు సంచరించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన స్పష్టం చేశారు. తుఫాను (Cyclone Murasu) కారణంగా తాగునీరు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు ఏర్పడితే వాటిని వీలైనంత త్వరగా పునరుద్ధరించాలని పవన్ సూచించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యమిస్తూ, తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటూ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.

