కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా తొలిరోజు పోలింగ్‌లో పలుచోట్ల అక్రమాలు, ఏజెంట్ల అడ్డగింపు, అల్లర్లు చోటుచేసుకోవడంతో రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం నాటి పోలింగ్‌ను రద్దు చేస్తూ ఏపీలోని 13 పోలింగ్ స్టేషన్లలో సోమవారం ఉదయం 7 గంటల నుంచే రీపోలింగ్ (AP Repolling) ప్రక్రియను ప్రారంభించింది. సాయంత్రం 5 గంటల వరకు ఈ ఓటింగ్ కొనసాగనుంది. వైఎస్సార్ కడప, అనంతపురం, తిరుపతి, పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని కడప (15/2), అనంతపురం (30/3), మాచర్ల (23/1, 23/2), చీమకుర్తి (14/1), పులివెందుల (1, 3, 7, 8 వార్డులు), జమ్మలమడుగు (3, 17, 29 వార్డులు)లోని పలు పోలింగ్ కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత నడుమ ఓటింగ్ నిర్వహిస్తున్నారు.
అయితే గత ఆదివారం పోలింగ్ కేంద్రాల ఆక్రమణ, దొంగ ఓట్లు వేశారనే ఆరోపణల నేపథ్యంలో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందులలో ఓటు వేయకుండానే వెనుదిరిగిన విషయం తెలిసిందే. “సక్రమంగా రీపోలింగ్ పెడితేనే వచ్చి ఓటు వేస్తాను” అని ఆయన బహిరంగంగా స్పష్టం చేశారు. ప్రస్తుతం జగన్ డిమాండ్ చేసిన విధంగానే రీపోలింగ్‌కు ఈసీ ఆమోదం తెలపడంతో ఆయన పులివెందుల వచ్చి ఓటు వేస్తారా లేదా అనే అంశం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
మరోవైపు రీపోలింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తున్నాయి. అనంతపురం 30వ డివిజన్ 3వ పోలింగ్ బూత్ పరిసర ప్రాంతాల్లో బీజేపీ, వైసీపీ శ్రేణుల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకోవడంతో వాతావరణం వేడెక్కింది. స్థానిక అధికారులు, పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అధికారులు ఆటోల ద్వారా ప్రచారం చేస్తూ ఓటర్లను చైతన్యపరుస్తున్నారు. అర్హులైన ఓటర్లందరూ ఎలాంటి భయాలు లేకుండా స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష విజ్ఞప్తి చేశారు.

