కలం, వెబ్ డెస్క్: నాగార్జునసాగర్-శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోని గిద్దలూరు డివిజన్ రాచర్ల బీట్‌లో పులి చనిపోయిన ఉదంతంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) స్పందించారు. పులి చనిపోయిందన్న విషయం తన దృష్టికి వచ్చిందని.. ఇది ఎంతో బాధాకరమని పేర్కొన్నారు. ప్రకృతి సమతుల్యంగా ఉండాలంటే పులుల సంరక్షణ ఎంతో ముఖ్యమని.. అలాంటిది ఒక పులి మరణించడం అనేది ఆందోళన కలిగిస్తోందని చెప్పారు. అడవులను, వన్యప్రాణులను కాపాడుకోవాల్సిన బాధ్యతను ఈ ఘటన తమకు మరోసారి గుర్తు చేస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా ఉండేందుకు అటవీ ప్రాంతాలలో పెట్రోలింగ్‌ను తక్షణమే పెంచాలని పేర్కొన్నారు.
పులి మరణానికి గల కారణాలు, సమగ్రమైన, పారదర్శకమైన విచారణ జరపాలని ఎన్ఎస్టీఆర్ ఫీల్డ్ డైరెక్టర్‌ను ఆదేశించారు. పులి సహజంగా మరణించిందా.. లేక వేటగాళ్ల దుశ్చర్య, విషప్రయోగం వంటి మానవ ప్రమేయం ఏదైనా ఉందా? అనే కోణాల్లో క్షుణ్ణంగా దర్యాప్తు జరగాలని పేర్కొన్నారు. వన్యప్రాణి సంరక్షణ నిబంధనలకు అనుగుణంగా పోస్ట్‌మార్టం, ఫోరెన్సిక్ పరీక్షలు నిర్వహించి మరణానికి గల అసలు కారణాన్ని నిర్ధారించాలని సూచించారు. ఆటవిలో క్షేత్రస్థాయి నిఘాను బలోపేతం చేయాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించారు. ఏపీ అటవీ సంపద, ఇక్కడి జీవవైవిధ్యాన్ని రక్షించుకోవడం ప్రజల కర్తవ్యమని చెప్పారు. ఈ ఘటనలో ఎవరిదైనా తప్పు ఉన్నట్లు తేలితే చట్టప్రకారం అత్యంత కఠినమైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

