కలం, వెబ్ డెస్క్: చట్టసభల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు (Women Bill), లోక్‌సభ నియోజకవర్గాల పెంపును ఉద్దేశించి ప్రవేశపెట్టిన డీలిమిటేషన్ బిల్లు, ఇందుకోసం అవసరమైన 131వ రాజ్యాంగ సవరణ బిల్లుకు లోక్‌సభలో జరిగిన ఓటింగ్‌లో మూడింట రెండొంతుల మెజారిటీ రాకపోవడంతో ఈ బిల్లులు వీగిపోయాయి. దీంతో మహిళా రిజర్వేషన్ అమలుకు బ్రేకులు పడ్డాయి. డీలిమిటేషన్ చేపట్టే ప్రక్రియ కూడా ఆగిపోయింది. రాజ్యాంగ సవరణ లేకపోవడంతో ఈ రెండు ప్రక్రియలూ ప్రభుత్వం ఆశించిన స్థాయిలో అమల్లోకి వచ్చే అవకాశం లేకుండా పోయింది. ఓటింగ్ ముగిసేంతవరకూ ఒక రకమైన ఉత్కంఠ నెలకొనగా ఆ తర్వాత పొలిటికల్ బ్లేమ్ గేమ్ మొదలైంది. డీలిమిటేషన్‌తో దేశాన్ని నార్త్, సౌత్ భాగాలుగా విభజించే కుట్రతో మహిళా బిల్లు పేరుతో కేంద్రం కుట్రలు చేస్తున్నదని, దాన్ని అడ్డుకున్నామని రాహుల్‌గాంధీ స్పష్టత ఇచ్చారు.
ఎన్డీఏ కూటమి మహిళా ఎంపీల నిరసనలు :
మహిళా రిజర్వేషన్ బిల్లు(Women Bill)కు కాంగ్రెస్ సహా విపక్షాలు అడ్డుపడ్డాయని ఆరోపిస్తూ ఎన్డీఏ కూటమి మహిళలు పార్లమెంటు ఆవరణలో ప్లకార్డులతో నిరసనలకు దిగారు. మహిళల నోటి దగ్గరకు వచ్చిన బువ్వను మట్టిపాలు చేశాయంటూ విపక్ష పార్టీలపై విమర్శలు చేశారు. రాజ్యంగ విరుద్ధంగా రాహుల్‌గాంధీ కుట్రకు పాల్పడ్డారని ఆరోపించారు. మోడీ ప్రభుత్వం అవకాశాలు ఇవ్వడటానికి ప్రయత్నిస్తే విపక్షాలు మాత్రం అడ్డుకునే కుట్రలు చేశాయన్నారు. కేవలం ఇండియా కూటమి కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్లు సాకారం కాలేదన్నారు. మహిళలకు ఇండియా కూటమి పార్టీలు ఏ రకంగా వ్యతిరేక భావనతో ఉన్నాయో అద్దం పడుతున్నదని ఎన్డీఏ కూటమి మహిళా ఎంపీలు వ్యాఖ్యానించారు. మహిళకు రాజకీయ అవకాశాలు ఇవ్వకుండా అడ్డుకున్న విపక్షాలకు రాబోయే ఎన్నికల్లో మహిళా ఓటర్లే బుద్ది చెప్తారని హెచ్చరించారు.
డీలిమిటేషన్‌కు సాకుగా మహిళా బిల్లు :
డీలిమిటేషన్ ప్రక్రియ చేయాలన్నది కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, దానికి సాకుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రధానం చేసి కుట్రపూరితంగా వ్యవహరించిందని కాంగ్రెస్ నేత రాహుల్‌గాంధీ సహా పలు విపక్షాల నేతలు లోక్‌సభ వేదికగా వ్యాఖ్యానించారు. మహిళలకు చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలన్న చిత్తశుద్ధి నిజంగా బీజేపీకి ఉన్నట్లయితే డీలిమిటేషన్ బిల్లుతో సంబంధం లేకుండా విడిగానే మహిళా రిజర్వేషన్ బిల్లును పెట్టాలని డిమాండ్ చేశారు. ఇప్పుడున్న 543 స్థానాల్లోనే మహిళలకు 33% సీట్లను కేటాయించడానికి తాము సిద్ధంగా ఉన్నామని, ఆ స్ఫూర్తితోనే బిల్లు పెట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళలకు అవకాశాలు లేకుండా చేశాయంటూ విపక్షాలను రాజకీయంగా విమర్శించాలన్న ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం ఈ బిల్లుల విషయంలో అడుగడుగునా కుట్రలకు పాల్పడిందని ఆరోపించారు.
రాజ్యాంగ సవరణ బిల్లు వీగడంతో ఇతర బిల్లులు వాపస్ :
డీలిమిటేషన్‌ను, మహిళా రిజర్వేషన్‌ను కలగలిపి తీసుకురావాలన్న నిర్ణయానికి అనుగుణంగా రాజ్యాంగ సవరణ అవసరం కావడంతో ఆ బిల్లును కూడా కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టింది. ఇది ముమ్మాటికీ మహిళా బిల్లు కాదని, రాజ్యాంగాన్ని మార్చే కుట్ర అని, అందుకే రాజ్యాంగ విరుద్ధంగా దొడ్డి దారిన మహిళా బిల్లు పేరుతో నియోజకవర్గాల సంఖ్యను పెంచే డ్రామా ఆడిందని కేంద్ర ప్రభుత్వాన్ని రాహుల్‌గాంధీ విమర్శించారు. రాజ్యంగ సవరణ బిల్లుకు అవసరమైన మూడింట రెండొంతుల మెజారిటీ లోక్‌సభలో రాకపోవడంతో బిల్లు వీగిపోయింది. దీంతో మిగిలిన రెండు బిల్లులను కేంద్ర ప్రభుత్వం ఉపసంహరించుకున్నది. కేంద్ర క్యాబినెట్ శనివారం ఉదయం అత్యవసరంగా సమావేశం కానున్నది. తదుపరి కార్యాచరణపై చర్చించనున్నది. రాజ్యాంగ సవరణ బిల్లును ఓడించడం ద్వారా దేశానికి జరిగే పెను ప్రమాదాన్ని నివారించగలిగామని రాహుల్‌గాంధీ సహా విపక్షాల నేతలు వ్యాఖ్యానించారు.
ఇకపైన పొలిటికల్ బ్లేమ్ గేమ్ :
రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంతో అధికార, విపక్ష పార్టీల మధ్య బ్లేమ్ గేమ్ మొదలు కానున్నది. విపక్షాలు అడ్డుపడిన కారణంగానే మహిళా రిజర్వేషన్ బిల్లుకు బ్రేక్ పడిందని ఇప్పటికే ఎన్డీఏ మహిళా ఎంపీలు ఆరోపిస్తున్నారు. కాంగ్రెస్ కారణంగానే మహిళా బిల్లుకు ఆటంకాలు ఏర్పడ్డాయని బీజేపీ ఇక నుంచి విమర్శలు తీవ్రం చేయనున్నది. అదే సమయంలో రాజ్యాంగాన్ని మార్చాలన్న కుట్రకు ముసుగుగా మహిళా రిజర్వేషన్ బిల్లును ముందుకు తీసుకొచ్చిందని కాంగ్రెస్ సహా విపక్షాలు కౌంటర్ ఇవ్వనున్నాయి. ఈ దేశానికి జరిగే పెను ప్రమాదాన్ని నివారించామని చెప్పనున్నది. మహిళా రిజర్వేషన్‌లకు తాము వ్యతిరేకం కామని, ఇప్పటికిప్పుడు డీలిమిటేషన్ బిల్లుతో లింకు పెట్టకుండా విడిగా బిల్లు పెడితే ఇప్పుడున్న 543 స్థానాల్లోనే మహిళలకు 33% సీట్లను రిజర్వు చేయడానికి సంపూర్ణంగా మద్దతు పలుకుతామని బీజేపీకి కౌంటర్ ఇవ్వడానికి రెడీ అవుతున్నది. అధికార, విపక్ష కూటముల మధ్య పొలిటికల్ బ్లేమ్ గేమ్ రోజుకో మలుపు తిరిగే అవకాశాలున్నాయి.

