కలం, మహబూబ్ నగర్ బ్యూరో: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నారని డీసీసీ అధ్యక్షులు సంజీవ్ ముదిరాజ్ (Sanjeev Mudiraj ) అన్నారు. మహబూబ్ నగర్ (Mahabubnagar) జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పాలమూరు అభివృద్ధిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు.
పాలమూరు గడ్డపై రైతు కుటుంబంలో పుట్టి సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డి ఉమ్మడి జిల్లా అభివృద్ధికి ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. మాజీ మంత్రి తన సొంత నియోజకవర్గమైన జడ్చర్ల నియోజకవర్గంలోని ఉదండపూర్ నిర్వాసితుల సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిర్వాసితులకు న్యాయం చేసే దిశగా రూ.650 కోట్ల పరిహారం విడుదల చేసిందన్నారు.
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పధకాన్ని పదేళ్లలో పూర్తిచేయలేకపోయిన గత ప్రభుత్వం నేడు ప్రాజెక్టు విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఒకప్పుడు వలసలకు చిరునామాగా ఉన్న పొలమూరును పరిశ్రమలు, ఉపాధి అవకాశాలకు కేంద్రంగా మార్చడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో మహబూబ్ నగర్ జిల్లాలో రూ.1200 కోట్లకుపైగా అభివృద్ది వనులకు కంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేపట్టినట్లు తెలిపారు.
విద్యారంగ అభివృద్ధికి విశేషంగా పాటుపడుతున్నట్లు తెలిపారు. మహబూబ్ నగర్ తోపాటు ఉమ్మడి జిల్లా సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం రెండో దశకు రూ. 2వేల కోట్ల కేటాయింపు. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు పూర్తి, కల్వకుర్తి, నెట్టెంపాడు, కోయిలసాగర్, బీమా ప్రాజెక్టుల పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటున్నట్లు వివరించారు.
ప్రజలకు వాస్తవాలు తెలనని, ఎవరి హయాంలో ఏం జరిగిందో ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రభుత్వం విమర్శలకు భయపడదని, అభివృద్ధి పనులతోనే సమాధానం చెబుతుందని స్పష్టం చేశారు. సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధి జహీర్ అఖ్తర్, మీడియాసెల్ కన్వీనర్ సీజే బెనహర్, ఏఎంసీ మాజీ చైర్ పర్సన్ బెక్కరి అనిత, డీసీసీ ప్రధాన కార్యదర్శి ఎంఎ.కలీం తదితరులు పాల్గొన్నారు.

