కలం, వెబ్ డెస్క్: అయ్యప్ప పూజ (Ayyappa Puja) ఏర్పాట్లు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలి 18 ఏళ్ల యువకుడు మృతి చెందిన విషాద ఘటన హైదరాబాద్‌లోని మణికొండలో చోటుచేసుకుంది. పూజా కార్యక్రమాల కోసం ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయ్యప్ప పూజకు సంబంధించిన ఫ్లెక్సీలను ట్రాన్స్‌ఫార్మర్ సమీపంలో కడుతుండగా ఉదయ్ (18) విద్యుత్ తీగలు తగిలి షాక్‌కు గురయ్యాడు.
తీవ్ర విద్యుత్ షాక్ కారణంగా అతడు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనలో మరో యువకుడు సాయి కూడా గాయపడగా, వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. యువకుడి మృతితో స్థానికంగా విషాదం నెలకొంది. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి సంబంధించిన వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. ఫ్లెక్సీల ఏర్పాటు సమయంలో విద్యుత్ ప్రమాదం జరగడంతో కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

