కలం, వెబ్‌డెస్క్: ఏపీ పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవాలు సైతం జోరుగా సాగుతున్నాయి. అభ్యర్థులు తమను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు గ్రామాలకు బంపరాఫర్లు ప్రకటిస్తున్నారు. తాజాగా ప్రకాశం జిల్లా కందుకూరు మండలంలోని మహాదేవపురం గ్రామ సర్పంచ్ (Mahadevapuram Sarpanch) పీఠం ఏకగ్రీవమైంది. టీడీపీ మద్దతుతో సర్పంచ్ అభ్యర్థిగా బరిలోకి దిగిన దామా శ్రీనివాసులు (Dama Srinivasulu) గ్రామాభివృద్ధికి రూ.99 లక్షలు సొంతంగా ఖర్చు చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో గ్రామస్తులంతా ఆయనకు మద్దతు ప్రకటించారు. ఈ మేరకు పోటీలో ఇతర అభ్యర్థులు లేకుండా ఏకగ్రీవ ఎన్నిక సాకారమైంది.
గత రెండేళ్లుగా జర్మనీలో ఉద్యోగం, వ్యాపారం చేస్తున్న శ్రీనివాసులు ఎన్నికల నేపథ్యంలో స్వగ్రామానికి వచ్చారు. ఇటీవల పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసే సమయానికి ఆయనకు పోటీగా ఎవరూ మిగలలేదు. దీంతో మహాదేవపురం సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామాభివృద్ధికి రూ.99 లక్షలు ఖర్చు చేస్తానని ఆయన ప్రకటించడం గ్రామస్తులను ఆకట్టుకున్నట్లు స్థానికంగా చర్చ నడుస్తోంది.

