ఏలేటి సవాల్‌.. చర్చకు రాని పొంగులేటి

కలం, నిర్మల్: రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి (Minister Ponguleti) బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్‌రెడ్డి  (MLA Alleti) విసిరిన బహిరంగ చర్చ సవాల్‌పై గురువారం ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. తన వద్ద ఉన్న ఆధారాలతో అసెంబ్లీ మీడియా పాయింట్‌కు ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చేరుకోగా.. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అక్కడికి రాలేదు. బహిరంగ చర్చకు నిర్ణయించిన సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి 2 గంటల వరకు ఏలేటి అక్కడే నిరీక్షించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 22ఏ నిషేధిత భూముల జాబితా, భూ భారతి వ్యవహారాలలో భారీ అవినీతి జరిగిందని ఆరోపించారు. ఈ అంశాలకు సంబంధించి తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయని, వాటితో సహా బహిరంగ చర్చకు తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.

ఫీనిక్స్ కంపెనీల నుంచి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో సంబంధాలున్న రాఘవ కన్ స్ట్రక్షన్ తదితర సంస్థలకు సుమారు రూ.15 వేల కోట్ల విలువైన భూములు, ఆస్తుల బదిలీలు అక్రమంగా జరిగాయని ఏలేటి ఆరోపించారు. ఈ వ్యవహారానికి సంబంధించి దాదాపు 102 షెల్ కంపెనీలకు సంబంధించిన పూర్తి ఆధారాలు తన వద్ద ఉన్నాయని తెలిపారు. రైతులు, భూ యజమానులకు చెందిన ప్రైవేటు పట్టా భూములను ఉద్దేశపూర్వకంగా 22ఏ నిషేధిత జాబితాలో చేర్చి, వాటి నుంచి తొలగించేందుకు కమీషన్లు, సెటిల్మెంట్ల పేరుతో వేధిస్తున్నారని విమర్శించారు. భూ భారతి వ్యవహారాల్లోనూ భారీ అవినీతి చోటుచేసుకుందని ఆరోపించారు.

ఈ భూ వ్యవహారాలపై అసెంబ్లీలో హౌస్ కమిటీ ఏర్పాటు చేయాలని లేదా సిట్టింగ్ జడ్జి, సీబీఐ, ఈడీలతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని ఏలేటి డిమాండ్ చేశారు. తన వద్ద ఉన్న ఆధారాలను కేంద్ర దర్యాప్తు సంస్థలకు అందజేస్తానని తెలిపారు. అలాగే కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కూడా ఈ అంశాలపై లేఖ రాసి ఆధారాలను పంపిస్తానని ప్రకటించారు. బహిరంగ చర్చకు మంత్రి పొంగులేటి హాజరుకాకపోవడంపై ఏలేటి మహేశ్వర్‌రెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. ఆరోపణలపై మంత్రి స్పందించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>