పేదల సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యం: వాకిటి శ్రీహరి

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణలో పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి వాకిటి శ్రీహరి (Vakiti Srihari) అన్నారు. ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో నిర్వహించిన చేయూత పింఛన్ల (Madhira Pensions) పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గతంలో మధిర నియోజకవర్గంలో 37,477 పింఛన్లు ఉండగా, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కొత్తగా 5,317 పింఛన్లు మంజూరు చేయడంతో మొత్తం పింఛన్ల సంఖ్య 42,794కు చేరిందని తెలిపారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు సవాలుగా ఉన్నప్పటికీ పేదలకు అందించే సంక్షేమ పథకాల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాజీపడటం లేదన్నారు.

మహిళల ఆర్థిక సాధికారతే ప్రభుత్వ ధ్యేయం..

రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనే మహత్తర లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి శ్రీహరి తెలిపారు. మహిళల చేతుల్లో ఆర్థిక వనరులు ఉంటే కుటుంబాలు అభివృద్ధి చెందుతాయని, పిల్లల చదువులు, ఆరోగ్యం, కుటుంబ అవసరాలకు ప్రాధాన్యత లభిస్తుందని అన్నారు. అందుకే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, గృహజ్యోతి పథకం ద్వారా 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, మహిళా సంఘాలకు రుణాలు, ఇందిరమ్మ ఇళ్లను మహిళల పేరుతో మంజూరు చేయడం వంటి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు. మహిళా స్వయం సహాయక సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేయడంతోపాటు మహిళలను బస్సుల యజమానులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను చేపడుతున్నామని తెలిపారు.

పేదల ఆకలి తీర్చేందుకు సన్నబియ్యం పంపిణీ..

గత ప్రభుత్వాల హయాంలో రేషన్ దుకాణాల ద్వారా దొడ్డు బియ్యం పంపిణీ చేస్తే, కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రతి అర్హుడికి ఆరు కిలోల చొప్పున సన్నబియ్యం అందిస్తోందని మంత్రి తెలిపారు. వర్షాభావ పరిస్థితులు, ఎల్‌నినో ప్రభావంతో వ్యవసాయ రంగం సవాళ్లను ఎదుర్కొంటున్నప్పటికీ ప్రజలకు ఆహార భద్రత కల్పించడంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదన్నారు.వచ్చే వర్షాకాలం వరకు ప్రజలకు అవసరమైన సన్నబియ్యం నిల్వలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, పంపిణీ నిరంతరాయంగా కొనసాగిస్తామని స్పష్టం చేశారు.

సోనియా గాంధీపై కేటీఆర్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం..

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను ప్రశ్నించే నైతిక హక్కు బీఆర్ఎస్ నాయకులకు లేదని మంత్రి వాకిటి శ్రీహరి విమర్శించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత తొలి శాసనసభలో సోనియా గాంధీ ధైర్యం చేయకపోతే తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది కాదని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా పేర్కొన్న విషయాన్ని గుర్తు చేశారు. అలాంటి కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పుడు సోనియా గాంధీ పుస్తకంలో తెలంగాణ ప్రస్తావన లేదంటూ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ‘‘కేటీఆర్ గారూ.. ముందు మీ తండ్రి కేసీఆర్ గారు అసెంబ్లీలో ఏం మాట్లాడారో తెలుసుకోండి. తెలంగాణ ఏర్పాటులో సోనియా గాంధీ పాత్రను మీ తండ్రే అంగీకరించారు. ఇప్పుడు మీరు ఆమెను విమర్శించడం ఎంతవరకు సమంజసం?’’ అని ప్రశ్నించారు.

రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిన బీఆర్ఎస్..

గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంపై సుమారు రూ.8 లక్షల కోట్ల అప్పుల భారం మోపిందని మంత్రి ఆరోపించారు. ఆర్థిక వ్యవస్థను గాడిలో పెడుతూనే పేదలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నాయకులు విమర్శలు చేయడం సరికాదన్నారు. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించినా, ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసినా, సన్నబియ్యం పంపిణీ చేసినా ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వానికి మంచి పేరు వస్తుందనే భయంతోనే బీఆర్ఎస్ నాయకులు సంక్షేమ కార్యక్రమాలను తప్పుబడుతున్నారని అన్నారు.

రైతుల సంక్షేమంలో కాంగ్రెస్‌కు ప్రత్యేక చరిత్ర..

రైతుల రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యేక చరిత్ర ఉందని మంత్రి శ్రీహరి అన్నారు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రైతులకు రుణమాఫీ అమలు చేసిందని, ప్రస్తుతం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రభుత్వం రూ.2 లక్షల వరకు పంట రుణమాఫీ చేపట్టిందని తెలిపారు. రైతులను ఆదుకోవడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని, వ్యవసాయ రంగానికి అవసరమైన సహాయ సహకారాలను అందిస్తామని పేర్కొన్నారు.

మధిర అభివృద్ధికి భట్టి నిరంతర కృషి..

ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు నిరంతరం కృషి చేస్తున్నారని మంత్రి శ్రీహరి ప్రశంసించారు. రాష్ట్రమంతా పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను తెలుసుకున్న భట్టి విక్రమార్కకు మధిర ప్రజలు అండగా నిలిచి భారీ మెజార్టీతో గెలిపించారని గుర్తు చేశారు. భట్టి విక్రమార్క రాష్ట్ర ఆర్థిక మంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో మధిర నియోజకవర్గంలోని ప్రతి కాంగ్రెస్ కార్యకర్త ఒక భట్టి విక్రమార్కలా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలో పేదల సమస్యలను తెలుసుకొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని సూచించారు.

కాంగ్రెస్‌కు రాజకీయాల కంటే పేదల సంక్షేమమే ముఖ్యం..

కాంగ్రెస్ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో రాజకీయాలకు అతీతంగా వ్యవహరిస్తోందని మంత్రి స్పష్టం చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం అనే తేడా లేకుండా అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలన్నదే తమ లక్ష్యమని తెలిపారు. ‘‘కాంగ్రెస్ పార్టీ అంటే పేదల పార్టీ. బడుగు, బలహీన వర్గాలకు అండగా నిలిచే పార్టీ. ఇందిరమ్మ కాలం నుంచి నేటి వరకు పేదల సంక్షేమమే మా విధానం’’ అని పేర్కొన్నారు.

మక్తల్ నుంచి మధిరకు ప్రత్యేక అనుబంధం..

కృష్ణానది కర్ణాటక నుంచి తెలంగాణలోకి ప్రవేశించే ప్రాంతంలో తన మక్తల్ నియోజకవర్గం ఉందని, అదే కృష్ణానది మధిర ప్రాంతం మీదుగా ఆంధ్రప్రదేశ్ వైపు ప్రవహిస్తుందని మంత్రి శ్రీహరి గుర్తు చేశారు. కృష్ణానది ద్వారా మక్తల్, మధిర ప్రాంతాలకు ప్రత్యేక అనుబంధం ఉందని, అదే విధంగా తనకు భట్టి విక్రమార్కతో ఆత్మీయ అనుబంధం ఉందన్నారు. మక్తల్ నియోజకవర్గం నుంచి ప్రత్యేకంగా మధిరకు వచ్చి చేయూత పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. తనకు మంత్రి పదవి ద్వారా లభించిన అవకాశాన్ని ప్రజాసేవకు అంకితం చేస్తానని, ఐదు శాఖల బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ ప్రజల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని తెలిపారు. మధిర నియోజకవర్గ ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళలు, పింఛన్ లబ్ధిదారులకు మంత్రి వాకిటి శ్రీహరి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఎటువంటి పరిమితులు లేకుండా పింఛన్లు..

కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. ఖమ్మం జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఎటువంటి పరిమితులు లేకుండా సామాజిక భద్రతా పింఛన్లు అందజేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు 1,75,000 మంది పింఛన్ పొందుతుండగా, తాజాగా అదనంగా మరో 25,000 మందికి కొత్త పింఛన్లను మంజూరు చేయడం జరిగింది. మధిర నియోజకవర్గంలో ఇప్పటికే 37,000 మంది పింఛన్ పొందుతుండగా, ప్రస్తుతం సుమారు 17 శాతం పెంపుతో అదనంగా 5,300 మందికి కొత్త పింఛన్లు మంజూరయ్యాయన్నారు.

దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరి అర్హతను క్షుణ్ణంగా పరిశీలించి, మండలానికి ఇంతే అనే కోటా/పరిమితులు పెట్టకుండా అర్హులైన అందరికీ పింఛన్లు మంజూరు చేశామన్నారు. గత 5 నుండి 10 ఏళ్లుగా, ప్రతి సోమవారం ప్రజావాణిలో పింఛన్ల కోసం ఎదురుచూస్తున్న వారందరికీ నేడు పింఛన్లు అందడంతో పండుగ వాతావరణం నెలకొందన్నారు. పొరుగు రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా దివ్యాంగులకు రూ. 4,016, ఇతర పింఛన్ దారులకు రూ. 2,016 చొప్పున ప్రభుత్వం అందిస్తోందని, ఈ ఆర్థిక సహాయం లబ్ధిదారులు సమాజంలో ఆత్మగౌరవంతో, స్వాభిమానంతో జీవించడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ డా. పి. శ్రీజ, ఇంచార్జ్ డీఆర్డీవో శిరీష, జిల్లా పశు సంవర్థక అధికారి డా. పురందర, జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం, జిల్లా క్రీడల అధికారి టి. సునీల్ కుమార్, మధిర మున్సిపల్ చైర్ పర్సన్ సాధినేని సుజాత, మార్కెట్ కమిటీ చైర్మన్ బండారు నర్సింహా రావు, మత్కేపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేశ్వర్లు, మధిర మున్సిపల్ కమిషనర్ సామ్యూల్, నియోజకవర్గ ఎంపీడీవోలు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>