ఒలింపిక్ గోల్డ్ మెడలిస్ట్‌పై మూడేళ్ల నిషేధం!

క‌లం, స్పోర్ట్స్: క్రీడా ప్రపంచంలో పెను సంచలనం నమోదైంది. ప్రస్తుత మారథాన్ ప్రపంచ ఛాంపియన్, ఒలింపిక్ స్వర్ణ పతక విజేత పెరెస్ జెప్చిర్చిర్‌ (Peres Jepchirchir)పై డోపింగ్ కారణంగా మూడేళ్ల నిషేధం పడింది. 33 ఏళ్ల ఈ కెన్యా స్టార్ అథ్లెట్‌పై అక్టోబర్ 20 నుండి ఈ నిషేధం అమల్లోకి వచ్చినట్లు అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ (ఏఐయూ) గురువారం అధికారికంగా ప్రకటించింది. ఆమెతో పాటు మరో ఇద్దరు కెన్యా రన్నర్లపైనా కఠిన చర్యలు తీసుకుంది.

గతంలో జెప్చిర్చిర్ తన కెరీర్‌లో ఎన్నో గొప్ప విజయాలు సాధించారు. 2021 టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలవడంతో పాటు న్యూయార్క్, బోస్టన్, లండన్ మారథాన్ టైటిళ్లను కైవసం చేసుకున్నారు. హాఫ్ మారథాన్‌లో ప్రపంచ రికార్డు కూడా నెలకొల్పారు. అయితే, ఈ ఏడాది ఆగస్టులో జరిగిన సిడ్నీ మారథాన్‌కు ముందు కెన్యాలో ఆమె నమూనాలను సేకరించారు. ఆ పరీక్షల్లో నిషేధిత ఉత్ప్రేరకం ‘ఈపీఓ’ ఆనవాళ్లు బయటపడటంతో ఈ వేటు పడింది.

జెప్చిర్చిర్‌తో పాటు 2026 వరల్డ్ రోడ్ రన్నింగ్ ఛాంపియన్‌షిప్ రజత పతక విజేత వెరోనికా లోలియోపైనా ఇదే కారణంతో మూడేళ్ల నిషేధం విధించారు. అలాగే, బయోలాజికల్ పాస్‌పోర్ట్ నిబంధనల ఉల్లంఘనపై రొనాల్డ్ కోరిర్‌పై ఆరేళ్ల నిషేధం పడింది. 2017 నుండి ఇప్పటివరకు ప్రపంచ రికార్డు హోల్డర్ రూత్ చెప్‌న్గెటిచ్‌తో సహా 140 మందికి పైగా కెన్యా అథ్లెట్లు డోపింగ్ ఉచ్చులో చిక్కుకున్నారు. కెన్యా అధికారులు డోపింగ్ నియంత్రణకు కృషి చేస్తున్నప్పటికీ, తాజా ఘటనలు ఇంకా చేయాల్సింది చాలా ఉందని సూచిస్తున్నాయని ఏఐయూ చీఫ్ బ్రెట్ క్లాతియర్ పేర్కొన్నారు.

ఈ నిషేధాలు తమ దేశ ప్రతిష్ఠకు పెద్ద దెబ్బ అని, అయితే నిజాయితీగా ఆడే అథ్లెట్లకు అండగా ఉంటామని కెన్యా యాంటీ డోపింగ్ ఏజెన్సీ అధిపతి పెనినా వహోమ్ తెలిపారు. 2029 ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు నైరోబీ ఆతిథ్యం ఇవ్వనున్న నేపథ్యంలో, కెన్యా తన ప్రతిష్ఠను కాపాడుకోవాలంటే డోపింగ్‌ను పూర్తిగా అరికట్టాలని ప్రపంచ యాంటీ డోపింగ్ ఏజెన్సీ (డబ్ల్యూఏడీఏ) చీఫ్ విటోల్డ్ బాంకా గత నెలలో సూచించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>