Mobile Popup Ad
Mobile Popup Ad

తాగునీటి సరఫరాను నిరంతరం పర్యవేక్షించాలి : కలెక్టర్ ఇలా త్రిపాఠి

కలం, నిజామాబాద్ బ్యూరో : వేసవి నేపథ్యంలో నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో తాగునీటి సరఫరాపై జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది. ప్రతి నివాస ప్రాంతానికి రక్షిత మంచినీరు నిరంతరంగా అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి (Ila Tripathi)  అధికారులను ఆదేశించారు. ఆర్మూర్ మండల పరిషత్ కార్యాలయంలో శుక్రవారం ఆర్మూర్ నియోజకవర్గం పరిధిలోని డొంకేశ్వర్, నందిపేట్, మాక్లూర్, ఆలూర్, ఆర్మూర్ మండలాల ఎంపీడీఓలు, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ తదితరులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గ్రామాల వారీగా నీటి సరఫరా పరిస్థితి, అందుబాటులో ఉన్న వనరులు, అవసరమైన మరమ్మతులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

గత వేసవిలో ఎదురైన తాగునీటి సమస్యలను గుర్తుచేసుకుంటూ, ఈసారి ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు తక్కువగా పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచించిన నేపథ్యంలో ముందస్తు ప్రణాళిక అవసరమని కలెక్టర్ (Ila Tripathi) పేర్కొన్నారు. నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవాలని, ఒక్క చుక్క నీరు కూడా వృథా కాకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చివరి గ్రామాలు, ఎత్తైన ప్రాంతాలకు కూడా నీటి సరఫరా సక్రమంగా జరిగేలా పర్యవేక్షణ చేయాలని సూచించారు. సమస్యలు ఉంటే వెంటనే జిల్లా అధికారుల దృష్టికి తీసుకురావాలని, పనులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ వేసవిలో ఎక్కడా నీటి ఎద్దడి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.

ప్రజలు నీటి కోసం నిరసనకు దిగితే సంబంధిత ఎంపీడీఓలను బాధ్యులుగా పరిగణిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. గ్రామాలు, మున్సిపల్ వార్డుల్లో సమన్వయంతో రక్షిత మంచినీటి సరఫరా జరిగేలా నిరంతర పర్యవేక్షణ అవసరమని తెలిపారు. చేతి పంపులు, బోర్‌వెల్స్‌కు తక్షణ ఫ్లషింగ్ చేయించాలని, పైప్‌లైన్లు ధ్వంసం చేయడం లేదా వాల్వ్‌లకు నష్టం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే పోలీసులకు ఫిర్యాదు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేయించాలని ఆదేశించారు. మంచినీటి ట్యాంకులను క్రమం తప్పకుండా శుభ్రం చేయాలని కూడా సూచించారు. సమావేశంలో ఆర్మూర్ సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియ, జెడ్పీ సీఈఓ సాయాగౌడ్, డీఆర్‌డీఓ సాయన్న, ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు, మున్సిపల్ కమిషనర్ ఉమా మహేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

Read Also: బ్యారేజీల రిపేర్లకు కోఆర్డినేషన్ కమిటీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>