కలం, మహబూబ్ నగర్ బ్యూరో : వీరనారి చాకలి చిట్యాల ఐలమ్మ (Chakali Ilamma) పోరాట స్ఫూర్తి యువతకు ఆదర్శమని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ (MP DK Aruna) అన్నారు. రైతాంగ పోరాట ధీరవనిత, బహుజన ఆత్మగౌరవ ప్రతీక చిట్యాల (చాకలి) ఐలమ్మ వర్ధంతి సందర్భంగా గురువారం మహబూబ్నగర్ (Mahabubnagar) పట్టణంలో మహనీయురాలి విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీకే అరుణ మాట్లాడుతూ.. నిజాం నిరంకుశ పాలనకు, భూస్వాముల అరాచకాలకు వ్యతిరేకంగా సింహంలా గర్జించిన వీరనారి ఐలమ్మ అని కొనియాడారు. భూస్వామ్య శక్తులకు ఎదురొడ్డి నిలిచిన ఐలమ్మ ధైర్యం అసమానమైనదని గుర్తుచేశారు.
హక్కుల కోసం ఐలమ్మ పోరాటం స్ఫూర్తిదాయకం
వీరనారి ఐలమ్మ పోరాట పటిమ తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. “భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరీ విముక్తి కోసం” ఆమె చేసిన వీరోచిత పోరాటం కేవలం ఒక ప్రాంతానికో లేదా ఒక కులానికో పరిమితం కాదని, అది యావత్ మహిళా లోకానికి, సమాజంలోని పీడిత ప్రజలందరికీ హక్కుల సాధనలో ఒక దిక్సూచిగా నిలిచిందని పేర్కొన్నారు. తెలంగాణ సమాజంలో ఐలమ్మ ప్రదర్శించిన ప్రతిఘటనా తత్వం ఎల్లప్పుడూ ఆదర్శనీయమని ఆమె అన్నారు.
నేటి తరం మహిళలు ఐలమ్మ ధైర్యాన్ని ఆదర్శంగా తీసుకుని అన్ని రంగాల్లో ముందడుగు వేయాలని, ఆత్మగౌరవంతో జీవించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుష్బూ గుప్తా , మేయర్ మమత, రాష్ట్ర బీజేపీ కార్యవర్గ సభ్యులు రతంగ్ పాండు రెడ్డి, జిల్లా బీజేపీ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి, కార్పొరేటర్లు కిరణ్ కుమార్ రెడ్డి, జ్యోతి, రజక సంఘం జిల్లా నాయకులు, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

