సింహం వస్తోందంటే గుంటనక్కల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి: కేటీఆర్

కలం, వెబ్ డెస్క్: జగిత్యాల నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభమవుతోందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ప్రకటించారు. జగిత్యాలలో కోలాహలం, ఒక పండుగ వాతావరణం ఇవాళ అందరికీ కనబడుతోందని చెప్పారు. తిరిగి జగిత్యాల నుంచే మళ్లీ పూర్వ వైభవం సాధించడానికి, కేసీఆర్ (KCR) ముఖ్యమంత్రి కావడానికి జగిత్యాల ప్రజల ఆశీర్వాదంతోనే కదం తొక్కుతామన్నారు. సింహం బయటికి వస్తోంది అంటే గుంటనక్కల గుండెల్లో ఇవాళ రైళ్లు పరుగెడుతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ ఒక సంవత్సరం తర్వాత ఒక బహిరంగ సభకు వస్తున్నారంటే.. ఎన్నో రకాల కుట్రలకు, కుతంత్రాలకు తెరలేపి కాంగ్రెస్ ప్రభుత్వం జగిత్యాలలో జరగబోతున్న జైత్రయాత్రను అడ్డుకునే ఒక చిల్లర ప్రయత్నం చేస్తోందన్నారు. ఏప్రిల్ 20వ తేదీన జగిత్యాలలో నిర్వహించనున్న కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభా ప్రాంగణాన్ని కేటీఆర్, హరీశ్ రావు (Harish Rao) సందర్శించారు. అనంతరం పార్టీ సీనియర్ నేతలతో కలిసి మీడియాతో మాట్లాడారు.

ఎంత చిల్లర రాజకీయం ఇది?

సీఎం రేవంత్, మంత్రులు సిల్లీ రాజకీయాలు చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. ‘కేసీఆర్ ఇక్కడికి వస్తున్నారంటే సీఎం మేడిగడ్డకు వెళ్తారట. రెండున్నరేళ్లుగా మేడిగడ్డకు వెళ్లేందుకు ముఖ్యమంత్రికి సమయం లేకుండా ఉండి, అర్జెంట్‌గా కేసీఆర్ సభ ఇక్కడ ఉంటే.. టీవీల్లో సగం కేసీఆర్‌ను చూపెట్టాలి, సగం రేవంత్ రెడ్డిని చూపెట్టాలి అని చిల్లర రాజకీయాలు చేస్తున్నాడు. పేపర్లలో సగం రేవంత్ రెడ్డిదే రాయాలి, అవతలి వైపు కేసీఆర్‌ది రాయాలని ఒక చిల్లర ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ లాంటి ఒక నాయకుడు.. ఆయన ఈ వయసులో, ఈ స్థాయికి చేరుకున్న తర్వాత ఆయనకు పేపర్లో ఏమి రాస్తారు, టీవీ వాళ్లు ఏమి చూపెడతారు అనే విషయాలు పెద్దగా ప్రాధాన్యం ఉండదు.

జగిత్యాలకు వచ్చి, జనాలను కలుసుకుని, అందరి ముందు మాట్లాడి, లక్షలాది మందితో సంభాషించడం.. కేసీఆర్ కు తెలిసిందే కదా, ఆయన ప్రస్థానమే అది. అట్లాంటిది ఇవాళ ఆయన ఇక్కడికి వస్తుంటే కోరుట్లకు వెళ్లి వచ్చేవారందరికీ ఇక్కడికి రానీయకుండా రోడ్డు తవ్వుతున్నారట. ఎంత చిల్లర రాజకీయం ఇది. మూడేళ్లుగా గుర్తుకు రాని ఈ రోడ్డు, ఇప్పుడే గుర్తుకు వచ్చిందా? ఇక్కడున్న హైబ్రిడ్ ఎమ్మెల్యే.. ఒక హైబ్రీడ్ కూడా కాదు, ఇది ఏం బ్రీడో ఇది.. క్రాస్‌బ్రీడ్.. ఇది ఏం బ్రీడో ఆ బ్రీడ్ ఎమ్మెల్యే ఇక్కడున్న ఆయన ఏ పాటో ఆయనకే తెలియదు. కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటాడు, కాంగ్రెస్ పార్టీ మంత్రి పక్కన కూర్చుంటాడు. క్రాస్ బ్రీడ్ అనాలా, హైబ్రీడ్ అనాలా, ఏ బ్రీడ్ అనాలి? ఆయన ఏందో ఆయనే చెప్పుకోవాలి’ అని ఫైర్ అయ్యారు.

Read Also: రేపు చంద్రబాబు పరిస్థితి కూడా అదే! .. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>