కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లాలో రెండేళ్ల విరామం తర్వాత మండల పరిషత్ సర్వసభ్య సమావేశాలు మళ్లీ ప్రారంభం కానున్నాయి. 45 రోజులకు ఒకసారి తప్పనిసరిగా సమావేశాలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని 18 మండలాల్లో గురువారం సమావేశాలు నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం ఏర్పాట్లలో నిమగ్నమైంది. అయితే స్థానిక సంస్థలు ఎన్నికలు నిర్వహించకపోవడం, ఎంపీపీలు లేకపోవడంతో మండల ప్రత్యేక అధికారుల అధ్యక్షతన సమావేశాలు నిర్వహించనున్నారు.
గతంలో మూడు నెలలకు ఒకసారి ఎంపీపీల అధ్యక్షతన జరిగే ఈ సమావేశాలకు జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, సర్పంచులు, వివిధ శాఖల అధికారులు హజరయ్యేవారు. మండల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యలపై చర్చించేవారు. అయితే మండల పరిషత్ పాలకవర్గాల పదవీకాలం 2024 జూన్‌లో ముగియడంతో అప్పటి నుంచి సమావేశాలు నిలిచిపోయాయి. దీంతో గ్రామాల్లో తాగునీరు, రహదారులు, విద్యుత్, విద్య, వైద్యం, ఉపాధి హామీ లాంటి ఎన్నో సమస్యలు చర్చకు నోచుకోకుండా పోయాయి.
తాజాగా ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల్లో కేవలం సర్పంచులు, మండల స్థాయి అధికారులకే అవకాశం కల్పించడంతో ప్రజాప్రతినిధుల పాత్రపై సందిగ్ధత నెలకొంది. గ్రామాల సమస్యలకు పరిష్కార వేదిక మళ్లీ అందుబాటులోకి రావడంతో సర్పంచులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సమావేశాల్లో ప్రజల సమస్యలపై సమగ్రంగా చర్చించి, శాఖల వారీగా కార్యాచరణ రూపొందిస్తే గ్రామీణాభివృద్ధికి ఊతం లభిస్తుందని ఆశిస్తున్నారు.
Read Also: ఉమ్మడి ఆదిలాబాద్‌లో కుండపోత.. పరవళ్లు తొక్కుతున్న జలపాతాలు
Follow Us On : WhatsApp

