నిర్మల్‌లో బృందావనం వైభవం.. ప్రత్యేక ఆకర్షణగా లేజర్ షో

కలం, నిర్మల్ : వినాయక చవితి వచ్చిందంటే చాలు.. నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని భాగ్యనగర్ ముత్యాల వీధి సందడిగా మారుతుంది. భక్తి, కళాత్మకత, యువత ఉత్సాహం కలగలిసిన వేడుకలకు శ్రీ రాధాకృష్ణ గణేష్ మండలి వేదికగా నిలుస్తోంది. ప్రతి ఏటా వినూత్నమైన భారీ సెట్టింగ్‌తో గణనాథుడిని ప్రతిష్టిస్తూ భక్తులను ఆకట్టుకుంటుంది. ఈ సారి బృందావనం సెట్టింగ్‌తో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భాగ్యనగర్‌లోని ముత్యాల వీధిలో శ్రీ రాధాకృష్ణ గణేష్ మండలి ఆధ్వర్యంలో కొలువుదీరిన గణనాథుడిని దర్శించుకునేందుకు తొలి రోజు నుంచే నిర్మల్ పట్టణంతో పాటు పరిసర గ్రామాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. బృందావనం వాతావరణాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన భారీ సెట్టింగ్ చూపరులను కట్టిపడేస్తోంది. రాత్రివేళ వెలుగులు, ప్రత్యేక లైటింగ్‌ తో పాటు లేజర్ షో సందర్శకులను మరింత ఆకట్టుకుంటోంది.

ప్రతి ఏటా ఓ కొత్త ప్రపంచం..

శ్రీ రాధాకృష్ణ గణేష్ మండలి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏర్పాటు చేసే సెట్టింగ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉంది. గత ఏడాది యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయ నమూనా సెట్టింగ్‌ను ఏర్పాటు చేసి భక్తులకు యాదాద్రి వైభవాన్ని నిర్మల్‌లోనే చూపించారు. ఈ సారి అందుకు భిన్నంగా బృందావనం థీమ్‌ను ఎంచుకున్నారు. సుమారు రూ.12 లక్షల వ్యయంతో ఈ భారీ సెట్టింగ్‌ను రూపొందించినట్లు మండలి నిర్వాహకులు తెలిపారు. నిర్మల్ ప్రజలకు ప్రతిసారి కొత్త అనుభూతిని అందించాలన్న ఉద్దేశంతోనే వినూత్నసెట్టింగ్‌లను ఏర్పాటు చేస్తున్నామని నిర్వాహకులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా తయారు చేయించిన వినాయక విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. విగ్రహం, సెట్టింగ్, లైటింగ్, లేజర్ షో కలయికతో మండలి ప్రాంగణం ప్రత్యేక ఆకర్షణగా మారింది.

యువత ఐక్యతే బలం..

కాలనీకి చెందిన యువకులంతా ఏకతాటిపైకి వచ్చి నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. ఉత్సవాల నిర్వహణలో యువత చూపిస్తున్న ఉత్సాహం, సమన్వయం ప్రత్యేకంగా కనిపిస్తోంది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తూ, గణనాథుడి దర్శనానికి వచ్చే వారికి ఆహ్లాదకరమైన అనుభూతిని అందిస్తున్నారు. ప్రతి ఏటా ఓ కొత్త థీమ్‌తో వినాయక ఉత్సవాల్లో శ్రీ రాధాకృష్ణ గణేష్ మండలి సెట్టింగ్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>