కలం, స్పోర్ట్స్ : టీమిండియాలోకి భువనేశ్వర్ కుమార్ (Bhuvneshwar Kumar) మళ్లీ వస్తారా? ఈ చర్చకు ఇప్పుడు మరింత బలం వచ్చింది. ఆర్‌సీబీ వరుసగా రెండు ఐపీఎల్ టైటిళ్లు గెలవడంలో కీలకంగా నిలిచిన భువీ.. మళ్లీ భారత్ తరఫున ఆడాలని తన కోరికను వెల్లడించాడు. 36 ఏళ్ల భువనేశ్వర్ 2022 తర్వాత టీమిండియాకు దూరంగా ఉన్నాడు. 2026 ఐపీఎల్‌లో మాత్రం అదరగొట్టాడు. ఆర్‌సీబీ తరఫున 28 వికెట్లు తీశాడు. 17.89 బౌలింగ్ సగటుతో సత్తా చాటాడు. 2025 సీజన్‌లోనూ భువీ 17 వికెట్లు పడగొట్టాడు. కొత్త బంతితోనే కాదు.. పాత బంతితోనూ ప్రభావం చూపించాడు.
ఇటీవల జతిన్ సప్రు యూట్యూబ్ ఛానల్‌లో మాట్లాడిన భువీ.. భారత్ తరఫున మళ్లీ ఆడితే సంతోషిస్తానని చెప్పాడు. అయితే ఇప్పుడు జాతీయ జట్టులో చోటు కోసం ఎదురుచూస్తూ కూర్చునే పరిస్థితి తనకు లేదని స్పష్టం చేశాడు. గతంలో తనకు వరుసగా కొన్ని సిరీస్‌లకు అవకాశం రావొచ్చని సమాచారం అందిందని భువీ చెప్పాడు. దాంతో త్వరలోనే టీమిండియాలోకి వస్తానని భావించాడు. కానీ తర్వాత అది జరగదని అర్థమైంది.
ఆ పరిణామం సులభంగా అనిపించకపోయినా.. చివరకు దాన్ని అంగీకరించానని భువీ (Bhuvneshwar Kumar) తెలిపాడు. ఈ సమయంలో తన కుటుంబం ఎంతో అండగా నిలిచిందని చెప్పాడు. 2022 నవంబర్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టీ20 మ్యాచ్‌లో భువనేశ్వర్ చివరిసారిగా భారత్ తరఫున ఆడాడు. ఇప్పటివరకు మూడు ఫార్మాట్లలో కలిపి 229 మ్యాచ్‌లు ఆడాడు. 294 వికెట్లు తీశాడు. ఇటీవలి ఐపీఎల్ ప్రదర్శనతో భువనేశ్వర్ మరోసారి టీమిండియా రీఎంట్రీ చర్చలోకి వచ్చాడు. తుది నిర్ణయం మాత్రం జాతీయ సెలెక్టర్ల ఎంపికపై ఆధారపడి ఉంటుంది.

