కలం, నిర్మల్ : పోగొట్టుకున్న, చోరీకి గురైన మొబైల్ ఫోన్లను (Lost Mobile Phones) గుర్తించి బాధితులకు తిరిగి అందించడంలో నిర్మల్ జిల్లా పోలీసులు (Nirmal Police) మరోసారి విజయవంతమయ్యారు. సీఈఐఆర్ పోర్టల్ (CEIR Portal) ద్వారా గుర్తించిన 115 మొబైల్ ఫోన్లను మంగళవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల బాధితులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, చోరీకి గురైనా వెంటనే సీఈఐఆర్ పోర్టల్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు.
ఫిర్యాదుల ఆధారంగా ఫోన్లను గుర్తించి బాధితులకు తిరిగి అందించేందుకు పోలీసులు చర్యలు తీసుకుంటారని తెలిపారు. జిల్లాలో ఇప్పటివరకు మొత్తం 2492 మొబైల్ ఫోన్లను గుర్తించి యజమానులకు అప్పగించినట్లు వెల్లడించారు. సెకండ్‌హ్యాండ్ మొబైల్ ఫోన్లు కొనుగోలు చేసే ముందు అవి చోరీకి గురైనవా కాదా అన్నది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఉపేందర్ రెడ్డి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

