సర్పంచులకు నో ఎంట్రీ.. మంత్రుల కార్యక్రమంలో హైడ్రామా

కలం, నిర్మల్: గ్రామంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం జరుగుతుంటే ముందువరుసలో ఉండాల్సిన గ్రామ ప్రథమ పౌరులు (Sarpanches) అదే కార్యక్రమానికి వచ్చి గేటు వద్దే నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిర్మల్‌ జిల్లాలో సోమవారం మంత్రుల పర్యటన సందర్భంగా సర్పంచులకు ఎదురైన ఈ పరిణామం చర్చనీయాంశంగా మారింది.

రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం జిల్లాలో పర్యటించి సుమారు రూ. 23.35 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బాసర గోదావరి పుష్కరాల సందర్భంగా చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులతో పాటు బాసర, కడెం తహసీల్దార్‌ కార్యాలయాలు, కడ్తాల్‌, గొడిసెరాల, లోకేశ్వరం, కుబీర్‌, ఓల, బోరిగాం గ్రామాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల నిర్మాణ పనులకు మంత్రులు, రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారులు శంకుస్థాపనలు చేశారు.

ఈ కార్యక్రమాలకు ఆయా గ్రామాల సర్పంచులకు అధికారులు సమాచారం ఇవ్వడంతో వారు కలెక్టరేట్‌కు చేరుకున్నారు. అయితే అక్కడికి వచ్చిన తర్వాత ప్రోటోకాల్‌ ప్రకారం సర్పంచులకు అనుమతి లేదు అంటూ కలెక్టరేట్‌ ప్రధాన ద్వారం వద్దే నిలిపివేసినట్లు సర్పంచులు తెలిపారు. దీంతో వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామానికి ప్రథమ పౌరుడైన సర్పంచ్‌ లేకుండానే గ్రామ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు ఎలా చేస్తారని వారు ప్రశ్నించారు.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి గతంలో మామడ మండలం పొన్కల్‌ గ్రామంలో సదర్మాట్‌ బ్యారేజీ ప్రారంభోత్సవం సందర్భంగా మహిళా సర్పంచ్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి, తన పక్కనే కూర్చోబెట్టిన విషయాన్ని ఈ సందర్బంగా సర్పంచ్ లు గుర్తుచేశారు.

ముఖ్యమంత్రి స్థాయిలోనే గ్రామ ప్రథమ పౌరులకు గౌరవం కల్పిస్తుంటే.. మంత్రుల పర్యటనలో తమకు కనీస ప్రాధాన్యం ఇవ్వకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో ప్రజలతో నిత్యం మమేకమై పనిచేసే సర్పంచులకు తగిన గౌరవం ఇవ్వాలని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రోటోకాల్‌పై స్పష్టత ఇవ్వాలని సర్పంచులు డిమాండ్‌ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>