కలం, నిర్మల్: దేశానికి స్వాతంత్రం వచ్చి 80 ఏళ్లు పూర్తవుతున్నా నిర్మల్ (Nirmal) నియోజకవర్గంలోని దళితులకు రాజకీయ స్వాతంత్రం ఇంకా అందలేదని అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు బత్తుల రంజిత్ అన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన మాట్లాడుతూ.. నిర్మల్ నియోజకవర్గం ఏర్పడి సుమారు 74 ఏళ్లు గడుస్తున్నా దళితులకు నామినేటెడ్ పదవుల్లో కీలక బాధ్యతలు దక్కకపోవడం బాధాకరమన్నారు.
నిర్మల్ నియోజకవర్గంలో దళితుల ఓట్లు సుమారు 30 వేల వరకు ఉన్నాయని, ఇంతటి రాజకీయ ప్రాధాన్యత ఉన్నప్పటికీ దళితులకు తగిన రాజకీయ ప్రాతినిధ్యం (Dalits Representation) ఎందుకు దక్కడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ సామాజిక న్యాయాన్ని నినాదంగా తీసుకుని అధికారంలోకి వచ్చిందని, దళిత రాజకీయ నాయకులకు తగిన ప్రాధాన్యత కల్పించి రాజకీయ స్వాతంత్రం కల్పించాలని కోరారు. దళితులకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించకపోతే జిల్లా వ్యాప్తంగా రాజకీయ, సామాజిక సమానత్వం కోసం ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.

