కలం, నిర్మల్ : తానూర్ మండలం బెంబర్ (Bember) ప్రాథమికోన్నత పాఠశాలలో రెండో తరగతి చదువుతున్న విద్యార్థిని పాఠశాల సమయం ముగిసిన అనంతరం తరగతి గదిలోనే ఉండిపోగా, గదికి తాళం వేసిన ఘటనపై జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యార్థుల భద్రత విషయంలో విధుల పట్ల నిర్లక్ష్యం వహించినందుకు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి. స్వప్నను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. అదేవిధంగా విధి నిర్వహణలో అలసత్వం వహించిన పాఠశాల స్కావెంజర్‌ను తక్షణమే విధుల నుంచి తొలగించినట్లు బుధవారం సాయంత్రం విడుదల చేసిన ప్రకటనలో కలెక్టర్ తెలిపారు.
పాఠశాల ముగింపు సమయంలో ప్రతి విద్యార్థి సురక్షితంగా పాఠశాల నుంచి బయటకు వెళ్లాడా లేదా అనే విషయాన్ని ఉపాధ్యాయులు, సిబ్బంది తప్పనిసరిగా నిర్ధారించుకోవాలని కలెక్టర్ సూచించారు. విద్యార్థుల భద్రత విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యానికి తావులేకుండా ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో విద్యార్థుల భద్రతా చర్యలను ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్ సూచించారు.
Also Read : ‘బేబీ’ మూవీ కాపీరైట్ కేసు.. కోర్టు ఏం చెప్పిందంటే?
Follow Us On: Youtube

