కలం, నిర్మల్: జిల్లాలోని అన్ని అంగన్‌వాడీ కేంద్రాల్లో చిన్నారులకు తప్పనిసరిగా పోషకాహారం అందించాలని కలెక్టర్ భవేశ్ మిశ్రా (Nirmal Collector) అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అంగన్‌వాడీలు, గిరిజనాభివృద్ధి సంస్థ విద్యాసంస్థలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి అంగన్‌వాడీ కేంద్రంలో పిల్లలందరికీ ప్రతిరోజు నాణ్యమైన పోషక ఆహారం అందించాలన్నారు. చిన్నారుల వికాస వివరాలు ఎప్పటికప్పుడు నమోదు చేసుకుంటూ ఉండాలన్నారు. పోషక లోపం కలిగిన పిల్లలను గుర్తించి, వారికి ప్రత్యేక పోషకాహారం అందించాలన్నారు. సూపర్‌వైజర్లు ఎప్పటికప్పుడు సంబంధిత అంగన్‌వాడీ కేంద్రాలను తనిఖీలు చేస్తూ ఉండాలన్నారు.
తప్పనిసరిగా పిల్లల హాజరు, అందిస్తున్న ఆహారం, కల్పిస్తున్న వసతులు పరిశీలించి వివరాలన్నీ నమోదు చేసుకోవాలన్నారు. ప్రీ మెట్రిక్, పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల అంశాలను చర్చించారు. ఈ సమావేశాల్లో టీటీడీవో నిహారిక, సంక్షేమ అధికారి వినూత్న తదితరులు పాల్గొన్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యనందించాలి
చిన్నారులకు ఆహ్లాదకరమైన వాతావరణంలో విద్యను అందించాలని కలెక్టర్ (Nirmal Collector) భవేశ్ మిశ్రా అన్నారు. మంగళవారం సోన్ మండల కేంద్రంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల, ఉన్నత పాఠశాలలను తనిఖీ చేశారు. ముందుగా ప్రాథమిక పాఠశాలను తనిఖీ చేసి పాఠశాలకు సంబంధించిన వివరాలు, ఉపాధ్యాయులు, విద్యార్థుల సంఖ్య, మధ్యాహ్న భోజనం తదితర వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులతో ఇంగ్లీషు కథలు చదివిపించి, ప్రశ్నలు అడిగి వారి నుంచి జవాబులు రాబట్టారు. సమాధానాలు చెప్పిన విద్యార్థులను అభినందించి, వారికి పెన్నులు బహుమతులుగా ఇచ్చారు.
అనంతరం ఉన్నత పాఠశాలను తనిఖీ చేశారు. పాఠశాలకు సంబంధించిన వివరాలన్నీ అధికారుల ద్వారా తెలుసుకున్నారు. విద్యార్థులకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించడంతోపాటు, ప్రతిరోజు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం అందించాలని చెప్పారు. ఈ తనిఖీలో జిల్లా విద్యాశాఖ అధికారి భోజన్న, తహసిల్దార్ సంతోష్, తదితరులు పాల్గొన్నారు.

