కలం, వెబ్‌డెస్క్: భారత టెన్నిస్ స్టార్ నికి కల్యాండ పూనాచా (Niki Poonacha) అంతర్జాతీయ వేదికపై మరో ఘనవిజయాన్ని సాధించారు. అమెరికాలో జరిగిన ఇండయానా హార్డ్కోర్ట్ ఛాంపియన్షిప్ 2026 డబుల్స్ టైటిల్‌ను ఆయన కైవసం చేసుకున్నారు. ఎక్వడార్కు చెందిన గొంజాలొ ఎస్కోబార్‌తో కలిసి నికి ఈ ఘనత సాధించారు. శనివారం బీబీ విన్ కోర్టులో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో నికి-ఎస్కోబార్ జోడీ అద్భుత ప్రదర్శన చేసింది. రెండో సీడ్ జోడీ అయిన అమెరికాకు చెందిన రాబర్ట్ కాష్, నెదర్లాండ్స్‌కు చెందిన బార్ట్ స్టీవెన్స్లపై 6-4, 6-1 తేడాతో విజయం సాధించింది. గత వారం లెగ్జింగ్టన్ ఓపెన్ గెలిచిన ఈ జోడీకి ఇది వరుసగా రెండో డబుల్స్ టైటిల్ కావడం విశేషం.
ఈ టోర్నీలో నికి-ఎస్కోబార్ జంట ఒక్క సెట్ కూడా ఓడిపోకుండా ఆధిపత్యం ప్రదర్శించింది. మొదటి రౌండ్లో అమెరికాకు చెందిన మైకేల్ ఆండ్రే, సామ్ లాండౌలను 6-3, 6-4తో ఓడించి బోణీ కొట్టారు. ఆ తర్వాత క్వార్టర్ ఫైనల్స్‌లో అమెరికాకే చెందిన నథానియల్ లామన్స్, జాక్సన్ విత్రోలను 6-4, 6-4తో చిత్తు చేశారు. సెమీఫైనల్స్‌లో ఆస్ట్రేలియా జంట అజీత్ రాయ్, జేమ్స్ వాట్లను 7-6(4), 7-6(2)తో ఓడించి ఫైనల్‌కు దూసుకెళ్లారు. ఫైనల్ మ్యాచ్ తొలి సెట్లో చివరి వరకు హోరాహోరీగా సాగినా, పదో గేమ్‌లో నికి జోడీ బ్రేక్ పాయింట్ సాధించి 6-4తో సెట్‌ను గెలుచుకుంది.
ఇక రెండో సెట్లో పూర్తిగా ఆధిపత్యం చెలాయిస్తూ రెండు, ఆరో గేమ్‌లలో బ్రేక్ సాధించి కేవలం ఒక గంట 14 నిమిషాల్లోనే మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో 31 ఏళ్ల నికి పూనాచా తన కెరీర్లో 12వ ఏటీపీ ఛాలెంజర్ డబుల్స్ టైటిల్‌ను నమోదు చేసుకున్నారు. ఇది ఈ 2026 సీజన్లో ఆయనకు ఆరో టైటిల్ కావడం విశేషం. ఈ విజయంతో లైవ్ ఏటీపీ డబుల్స్ ర్యాంకింగ్స్‌లో నికి 81వ స్థానానికి చేరుకున్నారు. రాబోయే ఆసియన్ గేమ్స్‌కు రిజర్వ్ ప్లేయర్‌గా ఉన్న నికి, ప్రస్తుతం భారతదేశంలో యుకి భంబ్రీ, శ్రీరామ్ బాలాజీల తర్వాత మూడో స్థానంలో కొనసాగుతున్నారు.

