కలం, వెబ్ డెస్క్: నీట్ (NEET) రద్దుతో దేశవ్యాప్తంగా విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ అంశం రాజకీయంగా కూడా తీవ్ర కలకలం రేపింది. తాజాగా నీట్ రద్దుపై ఢిల్లీలో విద్యార్థులు ఆందోళనలు చేపట్టారు. ఎన్‌టీఏ కార్యాలయం ఎదుట పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుకుని నిరసనలు చేపట్టారు. “విద్యార్థుల జీవితంతో ఆటలు ఆడొద్దు”, “పేపర్ లీకేజ్ ఘటనపై కఠిన చర్యలు తీసుకోండి” అంటూ విద్యార్థులు నినాదాలు చేశారు. పలువురు విద్యార్థులు, తల్లిదండ్రులు పరీక్ష నిర్వహణ తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
నీట్ రద్దు
కేంద్ర పరీక్షల ఏజెన్సీ (NTA) మంగళవారం నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ అండర్‌గ్రాడ్యుయేట్ (NEET UG) 2026 పరీక్షను రద్దు చేసిన విషయం తెలిసిందే. మే 3న జరిగిన పరీక్షకు ముందు రాత్రే ప్రశ్నపత్రం లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఈ పరీక్షను కొత్త తేదీల్లో మళ్లీ నిర్వహిస్తామని ఎన్‌టీఏ ప్రకటించింది.
సీబీఐ దర్యాప్తు
పరీక్షా విధానం, మూల్యాంకన ప్రక్రియలో పారదర్శకతను కాపాడేందుకు, విద్యార్థుల విశ్వాసాన్ని నిలబెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్‌టీఏ తెలిపింది. కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే పరీక్ష రద్దు నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించింది. “దర్యాప్తు వివరాలు, ఎన్‌టీఏ పరిశీలన ఆధారంగా మే 3న నిర్వహించిన NEET (UG) 2026 పరీక్షను రద్దు చేయాలని నిర్ణయించాం” అని ఎన్‌టీఏ పేర్కొంది. ఈ కేసును సీబీఐకి అప్పగించినట్లు, దర్యాప్తునకు పూర్తి సహకారం అందిస్తామని తెలిపింది.
Read Also: సీఎం విజయ్ జ్యోతిష్యుడికి ప్రభుత్వంలో కీలక పదవి
Follow Us On : WhatsApp

