కలం, కరీంనగర్ బ్యూరో: ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో జరిగిన అంతర్గత విచారణలో భాగంగా మే 19న పద్మనగర్‌కు చెందిన బేతి రాజేందర్ (50) అనే వ్యక్తి డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో ఆర్ఎస్సై శ్రీకాంత్‌కు పట్టుబడ్డాడని సీపీ గౌస్ ఆలం (CP Gaush Alam) తెలిపారు. అయితే నిందితుడు కోర్టుకు హాజరుకాకుండానే కేసు డిస్పోజ్ అయినట్లు తేలిందని చెప్పారు. దీంతో ఈ కేసుకు సంబంధించిన పూర్తి వివరాలు సేకరించి, ఆ నివేదికను డీఐజీకి సమర్పించామన్నారు. ఈ నివేదిక ఆధారంగా నిందితుడి నుండి రూ.15 వేలు లంచంగా తీసుకుని, ఆర్ఎస్సై శనిగల శ్రీకాంత్, కోర్ట్ కానిస్టేబుల్ కె. సాయి కృష్ణ, డీడీ డిస్పోసల్ స్టేషన్ కానిస్టేబుల్ ఎన్. కిరణ్‌లు కలిసి డూప్లికేట్ ఎస్టీసీ (Summary Trial Case) నంబర్ ను పోలీస్ సైట్‌లో నమోదు చేసి కేసును అక్రమంగా డిస్పోజ్ చేసినట్లు ఆధారాలు లభించాయని తెలిపారు.
తాను పంపిన నివేదిక ఆధారంగా వారి ముగ్గురిపై శాఖాపరమైన చర్యల్లో భాగంగా ఇప్పటికే డీఐజీ సస్పెన్షన్ వేటు వేశారని స్పష్టం చేశారు. ఈ కేసు అనంతరం కరీంనగర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ తోపాటు ఇతర పోలీసు స్టేషన్లలో నమోదు అయిన డ్రంకెన్ డ్రైవ్ (DD) కేసుల్లో సమగ్ర విచారణ కొనసాగుతోందని సీపీ తెలిపారు. 2025 జనవరి నుండి 2026 జూన్ 30 వరకు నమోదైన డ్రంకెన్ డ్రైవ్ కేసులపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.
విచారణలో తేలిన విషయాలు..
జిల్లాలో 113 కేసులలో డూప్లికేట్ లేదా రిపీటడ్ ఎస్టీసీ నంబర్లను గుర్తించినట్లు సీపీ తెలిపారు. అయితే వాటిల్లో 13 కేసుల్లో మాత్రం అవినీతి జరిగినట్లు అధికారుల విచారణలో వెల్లడైందని చెప్పారు. 3 కేసులలో నిందితులు కోర్టుకు హాజరుకాకుండానే చెరో ఒకరు రూ.6,000, రూ.3,000, రూ.1,000 చొప్పున జరిమానా చెల్లించినట్లు చూపించి కేసులను తప్పుగా డిస్పోజ్ చేశారని తెలిపారు. 10 కేసులలో కోర్టు విధించిన జరిమానా కంటే నిందితుల నుంచి మొత్తం రూ.9,700 అదనంగా లంచంగా వసూలు చేశారని అన్నారు.
మిగిలిన 100 కేసుల్లో నిందితులు కోర్టులో హాజరై జరిమానా చెల్లించినప్పటికీ, కోర్టు రికార్డుల్లో పలు కేసులకు డూప్లికేట్ లేదా రిపీటెడ్ ఎస్టీసీ కేటాయించినట్లు విచారణలో తేలిందన్నారు.మొత్తంగా ఇప్పటివరకు జరిగిన విచారణలో 14 కేసుల్లో రూ.34,700 మేర అవినీతి జరిగినట్లు తేలిందని, మీడియా కథనాల్లో వస్తున్నట్లు రూ.30 లక్షల అవినీతి జరిగిందనే వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని సీపీ స్పష్టం చేశారు. ఈ అంశంపై పూర్తిస్థాయి విచారణ ఇంకా కొనసాగుతోందన్నారు.
వాహనదారులకు సీపీ విజ్ఞప్తి
డ్రంకెన్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన నిందితులను సంబంధిత పోలీసు స్టేషన్ కోర్టులో హాజరు పరుస్తారని, కోర్టు విధించిన జరిమానాను నేరుగా కోర్టు సిబ్బందికే చెల్లించాలని సీపీ విజ్ఞప్తి చేశారు. అట్టి రశీదును సంబంధిత పోలీసు స్టేషన్ లో సమర్పించాలన్నారు. ఎవరైనా పోలీసులు అదనపు డబ్బులు డిమాండ్ చేసినా లేదా డబ్బులు తీసుకుని కోర్టులో హాజరు పరచకుండా డిడి కేసులను డిస్పోజ్ చేస్తామని తెలిపినా.. వెంటనే సీపీ కార్యాలయానికి /ఏసీబీ కార్యాలయానికి సమాచారం అందించాలని పేర్కొన్నారు.

