కలం, నారాయణపేట: ప్రత్యేక అవసరాలు గల దివ్యాంగులకు సదరం ధ్రువీకరణ అనంతరం పెన్షన్ అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ (Narayanpet Collector) సిహెచ్. ప్రియాంక (Priyanka) అధికారులను ఆదేశించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని ఎస్‌ఆర్ గార్డెన్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థుల తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. జిల్లాలో ప్రత్యేక అవసరాలు ఉన్న పిల్లల సంఖ్య, వారి అవసరాలు, ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, సేవలపై తల్లిదండ్రులకు పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. పిల్లలకు పెన్షన్ అందుతుందా, వారు పాఠశాలలకు అనుసంధానమై ఉన్నారా, ఐఆర్‌పీలు ఇళ్లకు వెళ్లి అవసరమైన సేవలు అందిస్తున్నారా అనే అంశాలను అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు.
పెన్షన్ అందని వారికి అవసరమైన ధ్రువపత్రాలు, దరఖాస్తు ప్రక్రియపై అవగాహన కల్పించాలని ఆదేశించారు. వినికిడి లోపం ఉన్న చిన్నారులను గుర్తించి అవసరమైన సహాయం అందించాలని సూచించారు. సెప్టెంబర్ 15న అలంకో సంస్థ సహకారంతో జిల్లా స్థాయిలో ప్రత్యేక క్యాంపు నిర్వహించనున్నట్లు తెలిపారు. అధికారులు, ఐఆర్‌పీలు, తల్లిదండ్రులు, పిల్లలు తప్పనిసరిగా పాల్గొనాలని, సమాచారం లేని కుటుంబాలను కూడా గుర్తించి క్యాంపునకు తీసుకురావాలని కోరారు. ప్రత్యేక అవసరాలున్న పిల్లలను పెంచడంలో తల్లిదండ్రుల ఓర్పు, ప్రేమ, అంకితభావం అభినందనీయమని కలెక్టర్ అన్నారు. ప్రతి చిన్నారిలోని ప్రతిభను గుర్తించి ప్రోత్సహిస్తే వారు భవిష్యత్తులో మంచి విజయాలు సాధిస్తారని పేర్కొన్నారు.
ఐడీఓసీ భవన పనులు త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్
నూతనంగా నిర్మిస్తున్న ఐడీఓసీ సముదాయ భవన నిర్మాణ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. ప్రియాంక అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె ఐడీఓసీ భవనాన్ని తనిఖీ చేసి నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఛాంబర్, మినిస్టర్ ఛాంబర్‌తో పాటు టాయిలెట్లు, వాటర్ ఆర్వో ప్లాంట్, వైరింగ్ తదితర పనులను పరిశీలించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రిసిటీ శాఖ అధికారులు విద్యుత్ సంబంధిత పనులన్నింటినీ త్వరితగతిన పూర్తిచేయాలని సూచించారు. మీటింగ్ హాల్‌లో స్క్రీన్ ఏర్పాటు చేయాలని, భవనం వెలుపల హార్టికల్చర్ శాఖ ఆధ్వర్యంలో గ్రీనరీ పనులను త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు.

