కలం, ఆదిలాబాద్ : ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వ్యవసాయంలో విస్తృతంగా వినియోగించి సాగు ఖర్చులు, సమయాన్ని తగ్గించడంతో పాటు రైతులు అధిక లాభాలు పొందాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Rajarshi Shah) సూచించారు. శుక్రవారం తలమడుగు మండలం పల్సి (కె) గ్రామంలో పర్యటించిన ఆయన డిజిటల్ క్రాప్ సర్వే, డ్రోన్ ద్వారా పత్తి చేనులో పురుగుమందుల పిచికారీ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. రైతు ఘన్‌శ్యామ్ పత్తి చేనులో డ్రోన్ స్ప్రేయింగ్‌ను పరిశీలించిన కలెక్టర్ దాని వినియోగం, ప్రయోజనాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు.
అనంతరం పొలాల్లో జరుగుతున్న డిజిటల్ క్రాప్ సర్వేను పరిశీలించారు. రైతులు వర్షాభావ పరిస్థితులను అధిగమించేందుకు సమీకృత వ్యవసాయ విధానాలను అవలంబించాలని సూచించారు. ఫాంపాండ్లు, పశువుల షెడ్లు, వర్మీ కంపోస్ట్ యూనిట్లు ఏర్పాటు చేసుకుని అదనపు ఆదాయం పొందాలని సూచించారు. నిరుద్యోగ యువతకు డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నామని కలెక్టర్ తెలిపారు.
పల్సి (కె) గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు డ్రోన్ పైలట్ శిక్షణతో పాటు సీఎస్‌ఆర్ నిధుల ద్వారా రూ.లక్ష మార్జిన్ మనీ, రాయితీపై బ్యాంకు రుణం అందించినట్లు చెప్పారు. భవిష్యత్‌లో మరింత మంది యువతకు ఉచిత డ్రోన్ శిక్షణ అందిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి బి. రవీందర్ సింగ్, ఎల్‌డీఎం ఉత్పల్ కుమార్, కేవీకే శాస్త్రవేత్తలు, అధికారులు, ప్రజాప్రతినిధులు, రైతులు, డ్రోన్ ఆపరేటర్లు, గ్రామస్థులు పాల్గొన్నారు.

