కలం, నల్లగొండ: మద్యం పార్టీ పేరుతో తీసుకెళ్లి, డబ్బుల గొడవతో యువకుడిని దారుణంగా హత్య చేసిన ఉదంతాన్ని నల్లగొండ జిల్లా పోలీసులు (Nalgonda Police) విజయవంతంగా ఛేదించారు. తిప్పర్తి (Tipparthy) పోలీస్ స్టేషన్ పరిధిలోని కేశరాజుపల్లి శివారులో జరిగిన బోథ్ సాయి కుమార్ (27) హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్లు నల్లగొండ అడిషనల్ ఎస్పీ జి.రమేష్ వెల్లడించారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి, నిందితులను విజయవాడలో పట్టుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. పోలీసుల కథనం ప్రకారం.. నల్లగొండ పట్టణ పరిధిలోని గొల్లగూడెం నివాసి అయిన మృతుడు బోథ్ సాయి కుమార్, గ్రామ దేవతల పండుగలలో ఆడవేషం ధరించి కొలుపులు చెప్పేవాడు.
జీవనోపాధి కోసం నల్లగొండకు వచ్చి చీరల వ్యాపారం చేస్తున్న నిందితుడు యూపీకి చెందిన ఫూర్ఖాన్ అలియాస్ మహేష్‌తో సాయి కుమార్‌కు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి అప్పుడప్పుడు మద్యం సేవించేవారు. ఈ క్రమంలో ఫూర్ఖాన్ తన వ్యాపార అవసరాల కోసం సాయి కుమార్‌ను రూ.30 వేలు అప్పు అడిగాడు. అయితే, తన వద్ద డబ్బు లేదని సాయి కుమార్ నిరాకరించడంతో ఫూర్ఖాన్ అతనిపై కక్ష పెంచుకున్నాడు. సాయి కుమార్ వద్ద ఉన్న బంగారు, వెండి ఆభరణాలను దోచుకోవాలనే ఉద్దేశంతో అతడిని హతమార్చడానికి పక్కా స్కెచ్ వేశాడు. ముందుగా వేసుకున్న పథకం ప్రకారం.. జూన్ 8వ తేదీన ఫూర్ఖాన్ తన సహచరుడైన యూపీకి చెందిన ఆరిఫ్‌తో కలిసి, సాయి కుమార్‌ను మద్యం పార్టీ పేరుతో మిర్యాలగూడ రోడ్డులోని కేశరాజుపల్లి శివారులో ఉన్న ఒక నిర్మాణంలో ఉన్న వెంచర్ ప్రాంతానికి తీసుకెళ్లాడు. ముగ్గురూ కలిసి మద్యం సేవించిన అనంతరం, రాత్రి సమయంలో డబ్బుల విషయమై మళ్లీ గొడవకు దిగారు.
ముందుగా అనుకున్నట్లుగా ఫూర్ఖాన్, ఆరిఫ్‌లు కలిసి సాయి కుమార్‌పై దాడి చేశారు. అనంతరం ఫూర్ఖాన్ అక్కడే ఉన్న సిమెంట్ రాయితో సాయి కుమార్ తలపై బలంగా కొట్టడంతో అతను అక్కడికక్కడే ప్రాణాలు విడిచాడు. హత్య అనంతరం నిందితులు మృతుడి ఒంటిపై ఉన్న ఒక బంగారు తాయెత్తు, బంగారు ముక్కుపుడక, చెవి కమ్మ (మొత్తం సుమారు 6 గ్రాముల బంగారం)తో పాటు, అతని హోండా ఆక్టివా స్కూటీ, సెల్ ఫోన్‌ను దొంగిలించి పరారయ్యారు. తమపై అనుమానం రాకుండా రక్తపు మరకలు ఉన్న బట్టలను రహస్యంగా దాచిపెట్టి, దోచుకున్న బంగారాన్ని అమ్మేందుకు విజయవాడకు పారిపోయారు.
అయితే, సాంకేతిక ఆధారాల సాయంతో నిందితుల కదలికలను కనిపెట్టిన పోలీసులు.. శుక్రవారం ఉదయం విజయవాడలో వారిని అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి పర్యవేక్షణలో టూటౌన్ సీఐ రాఘవరావు ఆధ్వర్యంలో కేసును వేగంగా ఛేదించిన తిప్పర్తి ఎస్ఐ శంకర్, రూరల్ ఎస్ఐ సైదా బాబు, ఏఎస్ఐ అఫ్జల్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాస్ రెడ్డి, శ్రీను, కానిస్టేబుళ్లు జానకిరాములు, రాంరెడ్డి, సునీల్, గుర్వారెడ్డి, రాజు, ముజ్జు, సైదులు, నాగరాజులను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ప్రత్యేకంగా అభినందించారు.

