కలం, నల్లగొండ బ్యూరో : నల్లగొండ (Nalgonda) జిల్లాలో ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. దీనికి అధికార యంత్రాంగం తోడవడంతో వారు చెప్పిందే వేదం.. చేసిందే చట్టంగా మారుతోంది. నల్లగొండ జిల్లాలో ఎంప్యానెల్ అయిన ఔట్ సోర్సింగ్ ఏజెన్సీలు దాదాపు 110 వరకు ఉన్నాయి. నిజానికి జిల్లాలో ఔట్ సోర్సింగ్ నియామకాలు కొన్ని శక్తుల చేతుల్లో బందీ అయిందనే ఆరోపణలు ఉన్నాయి. దశాబ్ద కాలంగా మారుతున్న ప్రభుత్వాలు.. అధికారులతో సంబంధం లేకుండా కొన్ని ఏజెన్సీలే జిల్లా ను శాసిస్తున్నాయి. పారదర్శకతకు పాతరేస్తూ నిబంధనలను తుంగలో తొక్కి.. కొత్త ఏజెన్సీలు రాకుండా అడ్డుకుంటున్న తీరుపై ఇప్పుడు సర్వత్రా నిరసన వ్యక్తమవుతోంది. గతంలో చక్రం తిప్పే ఏజెన్సీలకు నామినేషన్ పద్దతిలో కేటాయించిన పోస్టులను నిర్దాక్షిణ్యంగా నిరుద్యోగుల నుంచి ఒక్కో పోస్టుకు రూ.2 లక్షలకు అంగడి సరుకులా అమ్మేసుకున్నారు. ఆ ఈజీ మనీకి అలవాటుపడిన ఏజెన్సీలే మళ్లీ అధికారులకు అమ్యామ్యాలు ముట్టజెప్పి గుట్టుచప్పుడు కాకుండా రెన్యూవల్ చేసుకుంటుండడం కొసమెరుపు.
గుత్తాధిపత్యం.. పైరవీల పర్వం
నల్లగొండ (Nalgonda) జిల్లాలో మార్కెటింగ్ శాఖ, పోలీస్ శాఖ, మెడికల్ కాలేజ్, గురుకులాలు ఇలా సుమారు 30కి పైగా ప్రభుత్వ విభాగాల్లో ఔట్ సోర్సింగ్ సేవలు కొనసాగుతున్నాయి. అయితే ఈ కీలక శాఖలన్నీ కేవలం నాలుగైదు పాత ఏజెన్సీల చేతుల్లోనే ఉండటం గమనార్హం. ఒక్కో ఏజెన్సీ 100 నుండి 300 మంది సిబ్బందిని నిర్వహిస్తూ.. కోట్లాది రూపాయల టర్నోవర్‌తో జిల్లాలో ఏకఛత్రాధిపత్యం చలాయిస్తున్నాయి. ప్రతి ఏటా టెండర్లు నిర్వహించాలన్న నిబంధన ఉన్నా, అధికారులను ‘మేనేజ్’ చేస్తూ ఏళ్ల తరబడి రెన్యూవల్స్ పొందుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఉపాధి కోసం నూతనంగా ఏర్పడి ఎంప్యానెల్ అయిన 100కు పైగా ఏజెన్సీలు ఉన్నప్పటికీ, వారికి అవకాశం రాకుండా పాత ఏజెన్సీలు రాజకీయ, ఆర్థిక పలుకుబడిని ఉపయోగిస్తుండడం గమనార్హం. పాలకులు సైతం వారికే వంతపాడుతూ వస్తున్నారు.
పీఎఫ్, ఈఎస్ఐ గోల్‌మాల్
నల్లగొండ జిల్లాలో సుమారు 3,500 మంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తుండగా, వీరి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏజెన్సీలు ప్రభుత్వం నుండి బిల్లులు పొందుతున్నప్పటికీ, ఉద్యోగుల వాటాగా చెల్లించాల్సిన పీఎఫ్, ఈఎస్ఐలను సక్రమంగా జమ చేయడం లేదనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన అధికారులు ఏజెన్సీ నిర్వాహకులతో చేతులు కలిపి.. తప్పుడు రశీదులతో బిల్లులు పాస్ చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనివల్ల ఉద్యోగులకు రావాల్సిన సామాజిక భద్రత దూరమవుతోంది. మరోవైపు ప్రభుత్వం చెల్లిస్తున్న జీఎస్టీని కూడా ప్రభుత్వ ఖజానాకు కట్టకుండా సొంతానికి వాడుకుంటున్నారనే విమర్శలు లేకపోలేదు.
కాగా, ప్రస్తుతం ఎంప్యానెల్ అయి ఉన్న సుమారు 100 ఏజెన్సీలకు న్యాయం జరగాలంటే జిల్లా కలెక్టర్ బి.చంద్రశేఖర్, జిల్లా ఔట్ సోర్సింగ్ కమిటీ కఠిన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒకే ఏజెన్సీకి వందల పోస్టులు ఇవ్వకుండా, ప్రతి ఏజెన్సీకి 20 నుండి 30 పోస్టులు మాత్రమే కేటాయించేలా నిబంధనలు తీసుకురావాలి. పాత ఏజెన్సీల గడువు మార్చి నెలతో ముగిసిన నేపథ్యంలో తిరిగి వారికే కట్టబెట్టకుండా కొత్త టెండర్లు పిలవాలి. ఒకవేళ ఏజెన్సీల మధ్య పోటీ సమానంగా ఉంటే డ్రా పద్ధతి ద్వారా ఎంపిక చేసి అందరికీ సమాన అవకాశాలు కల్పించాలి. రాజకీయ పలుకుబడితో ఉద్యోగాలను అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్న ఏజెన్సీల ఆట కట్టించాల్సిన సమయం ఆసన్నమైంది. నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించాల్సిన ఔట్ సోర్సింగ్ రంగం.. కొందరి గుత్తాధిపత్యంగా మారడం జిల్లా అభివృద్ధికి గొడ్డలిపెట్టు. జిల్లా యంత్రాంగం స్పందించి.. పాత ఏజెన్సీల ఏకపక్ష దోపిడీకి అడ్డుకట్ట వేసి, నూతన ఏజెన్సీలకు అవకాశం కల్పించాలని నిరుద్యోగ యువత కోరుతోంది.
Read Also: లోక్‌సభలో వీగిన మహిళా బిల్లు.. సీఎం రేవంత్ షాకింగ్ రియాక్షన్!
Follow Us On : WhatsApp

