కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం (Khammam) నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో శుక్రవారం ఒక భారీ అగ్నిప్రమాదం సంభవించింది. అక్కడ ఉన్న ప్రముఖ కావేరీ హోటల్ వంటగదిలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికంగా తీవ్ర కలకలం రేగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. కిచెన్లో షార్ట్ సర్క్యూట్ కాగానే మంటలు క్షణాల్లో చుట్టుపక్కలకు వ్యాపించాయి.
అయితే, ప్రమాదం జరిగిన వెంటనే హోటల్ యాజమాన్యం, సిబ్బంది సమయస్ఫూర్తితో వ్యవహరించారు. హోటల్లో ఉన్న కస్టమర్లను, మిగిలిన సిబ్బందిని వెంటనే అప్రమత్తం చేసి సురక్షితంగా బయటకు పంపించడంతో ఒక పెద్ద ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సహాయంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేసేందుకు శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంలో ఎంతమేర ఆస్తి నష్టం జరిగింది అనే విషయాలతో పాటు, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

