జీతాలొచ్చేదెప్పుడో.. నల్లగొండ కార్పొరేషన్‌లో ఉద్యోగుల ఆవేదన!

కలం, నల్లగొండ బ్యూరో: పారిశుధ్య కార్మికుడి నుంచి, ఆఫీసులో కంప్యూటర్ ఆపరేటర్ వరకు అందరిదీ ఒకటే కన్నీటి ఆవేదన. పని చేస్తేనే వచ్చే జీతంతో కుటుంబాలను నెట్టుకొచ్చే ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఇళ్లలో ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఉద్యోగుల ఖాతాల్లో వేతనాలు జమ చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం చెబుతుండగా.. నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్‌లో (Nalgonda Municipal Corporation) మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. రెండు నెలలు అయినా వేతనాలు అందకపోవడంతో కార్మికులు, ఉద్యోగులు కుటుంబాలను నెట్టుకొచ్చేందుకు బయట అధిక వడ్డీలకు అప్పులు చేస్తూ తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

వేతనాలకే నెలకు రూ.1.20 కోట్లు

నల్లగొండ మున్సిపల్ కార్పొరేషన్ లో రెగ్యులర్ సిబ్బందికి సమానంగా క్షేత్రస్థాయి నుంచి ఆఫీసు వరకు ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు కీలక విధులు నిర్వహిస్తున్నారు. రెగ్యులర్ ఉద్యోగులతో పోల్చితే.. ఎక్కువగా ఔట్‌సోర్సింగ్ సిబ్బందే 814 మంది ఉన్నారు. వీరిలో పట్టణాన్ని శుభ్రంగా ఉంచే పారిశుధ్య కార్మికుల నుంచి ఆఫీసుల్లో విధులు నిర్వర్తించే జూనియర్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్ల వరకు ఉన్నారు. వీరికి నెలకు జీతాలు చెల్లించేందుకు కార్పొరేషన్‌కు దాదాపు రూ.1.20 కోట్లు అవసరమవుతాయి. రెండు నెలలుగా బిల్లుల చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. దీంతో జీతాలు రాకపోవడంతో ఇంటి అద్దెలు, పిల్లల స్కూల్ ఫీజులు చెల్లించలేక, నిత్యావసర సరుకులు కూడా కొనుగోలు చేయలేక ఉద్యోగులు, కార్మికులు తీవ్ర ఆర్థిక కష్టాలు పడుతున్నారు. జీతాల జాప్యం వెనుక కార్పొరేషన్ యంత్రాంగం ద్వంద్వ వైఖరే కారణమని తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి విధులు నిర్వర్తించకుండా కేవలం కాగితాలకే పరిమితమైన నకిలీ ఉద్యోగులకు అధికారులు నెలనెలా ఠంచనుగా జీతాలు చెల్లిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రోజూ చెమటోడ్చి పనిచేసే అసలైన ఉద్యోగులకు మాత్రం ఇవ్వకుండా కాలం వెళ్లదీస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నా రు. విధులకు రాని నకిలీ ఉద్యోగులపై చూపించే జాలి, దయ కష్టపడి పనిచేసేవారిపై ఎందుకు చూపడంలేదని ఉద్యోగ, కార్మిక సంఘాల నేతలు నిలదీస్తున్నారు.

ఐఎఫ్ఎంఎస్ సమస్యలు

మరోవైపు జీతాల చెల్లింపుల్లో పారదర్శకతకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐఎఫ్ఎంఎస్ విధానం కార్పొరేషన్ ఉద్యోగులకు శాపంగా మారింది. ఐఎఫ్ఎంఎస్ విధానంలో ఉద్యోగుల అటెండెన్స్ నమోదు చేస్తున్నప్పటికీ జీతాలు మాత్రం సరిగా ఇవ్వడంలేదు. దీనికి తోడు సాంకేతిక లోపాల కారణంగా కొందరు ఉద్యోగులు రోజూ తప్పకుండా బయోమెట్రిక్ లేదా ఆన్‌లైన్ అటెండెన్స్ వేస్తున్నప్పటికీ హాజరు నమోదు కావడం లేదు. ఫలితంగా రోజూ విధులకు హాజరైనప్పటికీ సాంకేతిక కారణాలతో జీతాలు కోత పడతాయేమోననే ఆందోళన ఉద్యోగులను ఆందోళనకు గురి చేస్తున్నది. అటెండెన్స్ లో తలెత్తిన సాంకేతిక సమస్యలను పరిష్కరించాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడంలేదని తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, జిల్లా ప్రజాప్రతినిధులు తక్షణమే స్పందించి కార్పొరేషన్‌లో పెండింగ్ జీతాలపై దృష్టి సారించి ఇప్పించాలని కోరుతున్నారు.

ఒకటో తేదీ హామీ లేదు.. రెండు నెలలుగా పెండింగ్

రాష్ట్ర ప్రభుత్వం ఒకటో తేదీనే వేతనాల హామీ నల్లగొండ కార్పొరేషన్‌లో నెలలు గడుస్తున్నా గాడిన పడకపోవడం గమనార్హం. ఐఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో సాంకేతిక సమస్యలను వెంటనే సరిదిద్దడంతో పాటు, నకిలీ ఉద్యోగుల వేతనాలపైనా సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ వినిపిస్తున్నది. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులకు పెండింగ్‌ జీతాలను వెంటనే విడుదల చేయాలని కోరుతున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>