బాల్య వివాహాలు లేని జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దాలి: కలెక్టర్

కలం, ఆదిలాబాద్ : బాల్య వివాహాలు లేని జిల్లాగా ఆదిలాబాద్‌ను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేస్తూ పకడ్బందీ కార్యాచరణ అమలు చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షి షా (Adilabad Collector) ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన జిల్లా స్థాయి సమన్వయ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. బాల్య వివాహాలు బాలల భవిష్యత్తు తో పాటు వారి విద్య, ఆరోగ్యం, సామాజిక ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతాయని పేర్కొన్నారు.

ఈ సామాజిక దురాచారాన్ని పూర్తిగా నిర్మూలించేందుకు ప్రభుత్వ శాఖలన్నీ బాధ్యతతో పనిచేయాలని, ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని సూచించారు. నవంబర్ 27న నిర్వహించనున్న బాల్య వివాహాల నిర్మూలన దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రత్యేక గ్రామసభలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గ్రామాన్ని బాల్య వివాహ రహిత గ్రామంగా తీర్చిదిద్దే దిశగా తీర్మానాలు చేయడంతో పాటు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు, చట్టపరమైన పరిణామాలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు.

పోలీసు, మహిళా, శిశు సంక్షేమ శాఖల అధికారులు బాల్య వివాహాలు జరిగే అవకాశమున్న ప్రాంతాలు, కుటుంబాలను ముందుగానే గుర్తించి నివారణ చర్యలు చేపట్టాలని సూచించారు. బాల్య వివాహాల సమాచారం అందిన వెంటనే స్పందించి వాటిని అడ్డుకోవాలని, చట్టాన్ని ఉల్లంఘించే వారిపై నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. విద్యాశాఖ అధికారులు పాఠశాలలు, కళాశాలల్లో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, మధ్యలోనే చదువు మానేసిన బాలికలను గుర్తించి తిరిగి విద్యను కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో బాల్య వివాహాల వల్ల కలిగే ఆరోగ్య సమస్యలు, తల్లీబిడ్డలపై పడే ప్రభావాలపై బాలికలు, తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. కల్యాణ మండపాల నిర్వాహకులు, డీజే ఆపరేటర్లు, క్యాటరింగ్ నిర్వాహకులు, మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలను బాల్య వివాహాల నిర్మూలన ప్రచారంలో భాగస్వాములను చేయాలని సూచించారు. మైనర్ల వివాహాలకు ఎవరూ సహకరించకుండా అవగాహన కల్పించాలని, మున్సిపల్ అధికారులు సైతం ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. బాల్య వివాహాల నిర్మూలన ప్రభుత్వ శాఖలకే పరిమితమైన బాధ్యత కాదని, ప్రజలు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు సమష్టిగా భాగస్వాములై సామాజిక ఉద్యమంగా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>