క్షయ రహిత లక్ష్యం దిశగా ప్రత్యేక శిబిరం.. నాగర్‌కర్నూల్ గ్రామాల్లో ఉచిత టీబీ పరీక్షలు

కలం ,నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూలు (Nagarkurnool ) జిల్లా నాగర్‌ కర్నూల్ మండలంలోని వనపట్ల, చందుబట్ల గ్రామాల్లో క్షయ (టీబీ) వ్యాధిగ్రస్తులను గుర్తించేందుకు సోమవారం ప్రత్యేక గుర్తింపు శిబిరాన్ని నిర్వహించారు. జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసి గ్రామస్థులకు ఉచిత వైద్య సేవలు అందించారు. టీబీ (క్షయ వ్యాధి) లక్షణాలు ఉన్న వారిని గుర్తించి వైద్య పరీక్షలు నిర్వహించారు. అవసరమైన వారికి ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు చేసి తదుపరి వైద్య సేవలకు సూచించారు. క్షయ వ్యాధిని ప్రారంభ దశలోనే గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని వైద్య నిపుణులు అవగాహన కల్పించారు. వ్యాధి లక్షణాలను నిర్లక్ష్యం చేయకుండా వెంటనే సమీప ప్రభుత్వ ఆసుపత్రిని సంప్రదించాలని సూచించారు.

పెద్ద ముద్దునూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ వాణి శిబిరాన్ని పర్యవేక్షించారు..ఎం.ఎల్.హెచ్.పి స్వాతి వైద్య సేవల నిర్వహణలో పాల్గొన్నారు. టీబీ సూపర్వైజర్లు శ్రీనివాసులు, శ్రావణ్ కుమార్ క్షయ వ్యాధి అనుమానితులను గుర్తించి అవసరమైన పరీక్షలు నిర్వహించేలా చర్యలు చేపట్టారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపర్వైజర్ ప్రమీల శిబిర నిర్వహణను సమన్వయం చేశారు. భవిష్య భారత్ బృందానికి చెందిన డాక్టర్ స్వాతి ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎక్స్‌రే టెక్నీషియన్లు అమన్, వీరేష్ అవసరమైన వారికి ఛాతీ ఎక్స్‌రే పరీక్షలు నిర్వహించారు. ఏ ఎన్‌ ఎం .వెంకటమ్మ, .హెల్త్ అసిస్టెంట్, రాజవర్ధన్ రెడ్డి. వైద్య సేవల్లో భాగస్వాములయ్యారు.

ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి టీబీ లక్షణాలు ఉన్న వారిని శిబిరానికి తీసుకువచ్చి పరీక్షలు చేయించడంలో కీలక పాత్ర పోషించారు. క్షయ వ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని, లక్షణాలు కనిపించిన వెంటనే పరీక్షలు చేయించుకోవడం ద్వారా వ్యాధి వ్యాప్తిని అరికట్టవచ్చని వైద్య బృందం ప్రజలకు సూచించింది. క్షయ వ్యాధి గాలి ద్వారా వ్యాపించే అంటువ్యాధి కావడంతో రెండు వారాలకు పైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రివేళల్లో చెమటలు పట్టడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు సూచించారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో టీబీ నిర్ధారణ పరీక్షలు, ఛాతీ ఎక్స్‌రే, చికిత్స, మందులు పూర్తిగా ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలిపారు. వైద్యుల సూచన మేరకు పూర్తి కాలం మందులు క్రమం తప్పకుండా వాడితే క్షయ వ్యాధిని పూర్తిగా నయం చేయవచ్చని వివరించారు. చికిత్సను మధ్యలో నిలిపివేయడం వల్ల వ్యాధి మళ్లీ తీవ్రరూపం దాల్చే ప్రమాదం ఉంటుందని, అందువల్ల వైద్యుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరారు. 2025 నాటికి దేశాన్ని క్షయ రహిత భారతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో ప్రభుత్వం అమలు చేస్తున్న జాతీయ క్షయ నిర్మూలన కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సహకరించాలని వైద్య బృందం ప్రజలకు విజ్ఞప్తి చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>