కలం, ఖమ్మం బ్యూరో : ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అనేది అణుబాంబు కంటే అత్యంత శక్తివంతమైన ఆయుధమని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యురాలు రేణుక చౌదరి (MP Renuka Chowdhury) పేర్కొన్నారు. శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పర్యటించిన ఆమె మాట్లాడుతూ, ఓటర్ల నమోదు, జాబితా సవరణ విషయంలో ప్రజలు, పార్టీ శ్రేణులు ఏమాత్రం అజాగ్రత్తగా ఉండవద్దని హెచ్చరించారు.
రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కు ముందు ఏ తుపాకీ, ఏ బుల్లెట్ కూడా సరికావని, ఎన్నికల రోజున ఓటు వేసేటప్పుడు పేద, ధనిక అనే తేడా లేకుండా భారతీయులందరూ సమాన స్థాయిలోనే ఉంటారని స్పష్టం చేశారు. ఓటు హక్కుపై నిర్లక్ష్యం వహించి, ఓటు వేయకపోతే రేపు ఏ ప్రభుత్వ సౌకర్యాన్ని కూడా ప్రశ్నించి, పొందే హక్కును కోల్పోతారని, ఓటు వేయకపోవడం మూర్ఖత్వమే అవుతుందని ఆమె హితవు పలికారు.
అనంతరం పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే గ్రామీణ ప్రాంత అభ్యర్థుల కోసం టేకులపల్లి మండల కేంద్రంలో రూ. 25 లక్షల ఐటీడీఏ నిధులతో నిర్మించ తలపెట్టిన నూతన గ్రంథాలయ భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యేతో కలిసి ఆమె భూమిపూజ చేసి, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, విద్యతోనే సామాజిక వికాసం, సమాజంలో సమూల మార్పులు సాధ్యమవుతాయని స్పష్టం చేశారు.
మారుమూల ప్రాంతాల విద్యార్థులు, నిరుద్యోగ యువతీ యువకులు ఉన్నత ఉద్యోగాల ప్రిపరేషన్ కోసం నగరాలకు వెళ్లకుండా, స్థానికంగానే ఈ గ్రంథాలయ వసతులను సద్వినియోగం చేసుకొని పోటీ పరీక్షల్లో రాణించాలని ఆకాంక్షించారు. ఈ శంకుస్థాపన కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ పసుపులేటి వీరబాబు, ఐటీడీఏ పీవో రాహుల్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.

