కలం, ఖమ్మం బ్యూరో : ఖమ్మం జిల్లా వైరా మండల పరిధిలోని పుణ్యపురం (Punyapuram) గ్రామ పంచాయతీలో ఒక వింత పరిస్థితి నెలకొంది. గ్రామాభివృద్ధిని పర్యవేక్షించాల్సిన సర్పంచే ఏకంగా పంచాయతీ కార్యాలయానికి తాళం వేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. గత 10 రోజులుగా ఈ కార్యాలయం తాళం వేసి ఉండటంతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అసలేం జరిగిందంటే?
పుణ్యపురం గ్రామ పంచాయతీ సర్పంచ్ మరియమ్మ (కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికయ్యారు) భర్తకు, పంచాయతీ సెక్రటరీకి మధ్య కొంతకాలంగా విభేదాలు నడుస్తున్నాయి. చేయని పనులకు సంబంధించి తప్పుడు బిల్లులను ఓకే చేయాలంటూ సర్పంచ్, ఆమె భర్త సెక్రటరీపై తీవ్ర ఒత్తిడి తెచ్చినట్లు సమాచారం. అయితే, ఆడిటింగ్‌లో ఇబ్బందులు వస్తాయని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బిల్లులు పాస్ చేయనని సెక్రటరీ నిరాకరించారు. దీంతో ఆగ్రహం చెందిన సర్పంచ్ మరియమ్మ, ఆమె భర్త కలిసి 10 రోజుల క్రితం పంచాయతీ కార్యాలయానికి తాళం వేశారు.
కార్యాలయానికి తాళం వేసినప్పటికీ, పంచాయతీ సెక్రటరీ ప్రతిరోజూ విధులకు హాజరవుతున్నారు. ఆఫీస్ తెరిచే అవకాశం లేకపోవడంతో, ఆయన ఇతర సిబ్బందితో కలిసి కార్యాలయం బయటే కూర్చొని పనులను పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో పారిశుధ్య పనులకు సంబంధించిన సామగ్రి, రికార్డులు అన్నీ లోపలే ఉండిపోవడం వల్ల విధుల నిర్వహణకు తీవ్ర ఆటంకం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ వివాదంపై పంచాయతీ కార్యదర్శి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అయినప్పటికీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ విషయంపై మండల పరిషత్ అభివృద్ధి అధికారి ని వివరణ కోరగా, తన దృష్టికి ఈ విషయం రాలేదని దాటవేసే ప్రయత్నం చేయడం గమనార్హం. అధికార పార్టీ ఒత్తిళ్ల వల్లే అధికారులు ఈ వ్యవహారంపై స్పందించడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. దీంతో విసిగిపోయిన పుణ్యపురం గ్రామస్థులు, జిల్లా కలెక్టర్ జిల్లా పంచాయతీ అధికారి వెంటనే స్పందించి ఈ సమస్యను పరిష్కరించి పంచాయతీ కార్యాలయాన్ని తెరిపించాలని డిమాండ్ చేస్తున్నారు.

